KCR: కేసీఆర్ మళ్లీ సెంటిమెంటుతో ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారు: మల్లు రవి
- బీజేపీ, టీఆర్ఎస్ సభల్లో ఒక్కరు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడలేదన్న మల్లు రవి
- మునుగోడులో గెలిస్తే ఏం చేస్తారో చెప్పలేదని విమర్శ
- టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని వ్యాఖ్య
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శలు గుప్పించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ... బీజేపీ, తెలంగాణ సభల్లో ఒక్కరు కూడా సామాన్య ప్రజల సమస్యలపై మాట్లాడలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ సెంటిమెంటు ద్వారా ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని చెప్పారు.
మునుగోడు ఉపఎన్నికలో గెలిస్తే ఏం చేస్తారనే విషయాన్ని అమిత్ షా, కేసీఆర్ ఇద్దరూ చెప్పలేదని అన్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడానికే వీరి సభలు పరిమితమయ్యాయని చెప్పారు. ఎన్నికల హామీలకు సంబంధించి ప్రస్తావనే రాలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదనేదే రెండు పార్టీల లక్ష్యమని చెప్పారు. అందుకే పరస్పరం తిట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిపై ప్రధాని మోదీ, అమిత్ షాలు మాట్లాడుతున్నారని... అలాంటప్పుడు కేసీఆర్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. మునుగోడులో టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని చెప్పారు.