Woman: భర్తను చంపేందుకు మహిళ పన్నాగం... రక్తపు మరకలుగా భ్రమింపజేసేందుకు టమాటా కెచప్ ఫొటోలు పంపిన కిరాయి హంతకులు!
- అనుపల్లవి, నవీన్ కుమార్ దంపతులు
- హిమవంత్ కుమార్ తో అనుపల్లవికి అక్రమ సంబంధం
- భర్తను అడ్డుతొలగించుకునేందుకు కుట్ర
- రూ.2 లక్షలకు ఒప్పందం
- నవీన్ కుమార్ ను కిడ్నాప్ చేసిన వ్యక్తులు
ప్రియుడి మోజులో పడి భర్తను అంతమొందించేందుకు ప్రయత్నించిన ఓ యువతిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను చంపేందుకు ఆమె తన తల్లిని, మరో ముగ్గురు వ్యక్తులను కూడా రంగంలోకి దింపింది. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ పేరు అనుపల్లవి. వయసు 26 సంవత్సరాలు. ఆమె నవీన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వారు దొడ్డబిదరకల్లు ప్రాంతంలో నివసిస్తున్నారు.
అయితే, అనుపల్లవికి హిమవంత్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ అక్రమ సంబంధానికి నవీన్ కుమార్ అడ్డుగా ఉన్నాడని భావించిన అనుపల్లవి, హిమవంత్ కుమార్... హరీశ్, నాగరాజు, ముగిలన్ అనే ముగ్గురు వ్యక్తులను హత్యకు పురమాయించారు. నవీన్ కుమార్ ను చంపేస్తే రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అంతేకాదు, రూ.90 వేలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చారు. జులై 23న ఆ ముగ్గురు వ్యక్తులు నవీన్ కుమార్ ను కిడ్నాప్ చేసి తమిళనాడుకు తీసుకెళ్లారు. అయితే అతడిని చంపే సాహసం చేయలేకపోయారు. నవీన్ కుమార్ తో స్నేహపూర్వకంగా మెలుగుతూ అందరూ కలిసి పార్టీ కూడా చేసుకున్నారు.
కాగా, నవీన్ కుమార్ ను చంపేశారా? అంటూ అనుపల్లవి, హిమవంత్ కుమార్ ఫోన్ చేయడంతో ఆ ముగ్గురు వ్యక్తులు అప్పటికప్పుడు ఓ ప్లాన్ అమలు చేశారు. నవీన్ కుమార్ ను చనిపోయినట్టు నటించమన్నారు. అతడిపై టమాటా కెచప్ పోసి రక్తపు మరకలుగా భ్రమింపజేసే ప్రయత్నం చేశారు. ఆపై ఫొటోలు తీసి అనుపల్లవి, హిమవంత్ కుమార్ లకు పంపించారు. అయితే, ఆ ఫొటోలను చూసిన తర్వాత హిమవంత్ కుమార్ భయభ్రాంతులకు గురయ్యాడు. ఈ హత్య కేసు తన మెడకు చుట్టుకుంటుందని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
అటు, తన సోదరుడు కనిపించడం లేదంటూ నవీన్ కుమార్ సోదరి ఆగస్టు 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగు రోజుల తర్వాత... ఆగస్టు 6న నవీన్ కుమార్ తిరిగొచ్చాడు. తన హత్యకు జరిగిన కుట్రను పోలీసులకు పూసగుచ్చినట్టుగా వివరించడంతో, వారు అనుపల్లవిని అరెస్ట్ చేశారు. అనుపల్లవి, హిమవంత్ కుమార్ ల ఫోన్ డేటాను పరిశీలించడంతో ఈ కుట్రలో అనుపల్లవి తల్లి అమ్మోజమ్మ పాత్ర కూడా ఉందన్న విషయం వెల్లడైంది. దాంతో పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు.