James Webb Telescope: గురు గ్రహంపై వలయాలను గుర్తించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు
- అంతరిక్షంలో కదిలే పరిశోధనాలయం జేమ్స్ వెబ్ టెలిస్కోపు
- తాజాగా గురు గ్రహం సమాచారం సేకరణ
- మునుపెన్నడూ చూడని దృశ్యాల ఆవిష్కృతం
రోదసిలో పరిభ్రమించే పరిశోధనాలయం అనదగ్గ జేమ్స్ వెబ్ టెలిస్కోపు గురు గ్రహానికి సంబంధించిన ఆసక్తికర దృశ్యాలను లోకానికి అందించింది. అత్యంత శక్తిమంతమైన ఈ స్పేస్ క్రాఫ్ట్ గురు గ్రహాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించింది. బృహస్పతి చుట్టూ వలయాలు ఉన్న సంగతిని జేమ్స్ వెబ్ టెలిస్కోపు మొదటిసారిగా గుర్తించింది. ఈసారి గురు గ్రహంపై తన దృష్టి సారించిన ఈ సంచార అబ్జర్వేటరీ భారీ తుపానులు, ప్రచండ గాలులు, ఆరోరాలు, అత్యంత అధిక ఉష్ణోగ్రతలు, పీడనం ఇత్యాది అంశాల డేటాను సేకరించి భూమికి చేరవేసింది.
అంతేకాదు, గురు గ్రహం ఉపరితలంపై కనిపించే పెద్ద ఎర్రని చుక్కను కూడా పరిశోధించింది. కాగా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫొటోలను సిటిజన్ సైంటిస్ట్ జూడీ స్మిత్ విశ్లేషించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ ఇమ్కే డి పాటర్ స్పందిస్తూ... గురు గ్రహంపై ఉన్న వలయాలు, దాని చిన్న ఉప్రగహాలు, ఓ గెలాక్సీ సహా ప్రతి అంశం స్పష్టంగా గోచరిస్తోందని వివరించారు.