China: భారతీయ విద్యార్థులకు చైనా తిరిగి స్వాగతం.. వీసాలిస్తున్నట్టు ప్రకటన

China to issue visas to Indian students after two and a half years

  • కరోనా ఆంక్షల నేపథ్యంలో 23 వేల మంది భారత విద్యార్థులు వెనక్కి
  • అందరికీ గుడ్ న్యూస్ అంటూ ప్రకటన విడుదల చేసిన చైనా
  • ఎక్స్-1 వీసాలకు దరఖాస్తు చేసుకోవాలన్న చైనా

కరోనా నేపథ్యంలో చైనాలో చదువులను మధ్యలోనే వదిలి వచ్చేసిన భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు చైనా శుభవార్త చెప్పింది. రెండున్నర సంవత్సరాల తర్వాత వీసా ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొంది. చైనా తిరిగి స్వాగతం పలుకుతోందంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల విభాగం కౌన్సెలర్ జీ రోంగ్ ట్వీట్ చేశారు. 

ఈ క్రమంలో విద్యార్థులు, వ్యాపారులు, చైనాలో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైందని ఢిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం కూడా ప్రకటించింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్తగా వచ్చే వారికి, కరోనా సమయంలో నిలిచిపోయిన చదువును పూర్తి చేయాలనుకుంటున్న వారికి ఎక్స్-1 వీసాలను జారీ చేస్తామని పేర్కొంది.

కరోనా సమయంలో చైనా నుంచి దాదాపు 23 వేల మంది విద్యార్థులు భారత్‌కు వచ్చేశారు. వీరిలో ఎక్కువమంది వైద్య విద్యార్థులే ఉన్నారు. ఇలాంటి వారిలో తిరిగి చైనా వచ్చి ఆగిపోయిన చదువును కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్న వారి జాబితాను చైనా ఇటీవల సేకరించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో వీరందరినీ ఆహ్వానిస్తోంది. 

చైనా వెళ్లాలనుకునే వారు అక్కడి యూనివర్సిటీలు తమకు జారీ చేసిన ప్రవేశ పత్రాన్ని వీసా కోసం సమర్పించాల్సి ఉంటుంది. పాత విద్యార్థులైతే చైనా జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీసాలు ఇస్తామని చైనా ప్రకటించినా.. భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం కొంత ఇబ్బంది కలిగించే విషయమే. మరోవైపు, శ్రీలంక, పాకిస్థాన్, రష్యా సహా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల ప్రత్యేక విమానాల్లో చైనాకు చేరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News