Bihar: పాట్నాలో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆందోళన.. యువకుడిని లాఠీతో చితకబాదిన అదనపు కలెక్టర్.. వీడియో ఇదిగో
- బీహార్ రాజధాని పాట్నాలో ఉద్యోగార్థుల ఆందోళన
- యువకుడి జుట్టు పట్టుకుని పక్కకు లాగిన అదనపు కలెక్టర్
- పోలీసుల నుంచి లాఠీ తీసుకుని చావబాదిన వైనం
- చోద్యం చూసిన పోలీసులు
- తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్
ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో బీహార్ ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ పాట్నాలో రోడ్డెక్కిన అభ్యర్థులపై పోలీసులు ప్రతాపం చూపారు. అదనపు కలెక్టర్ అయితే ఏకంగా లాఠీ పట్టుకుని ఓ యువకుడిని మీడియా కెమెరాల ముందే చితకబాదారు. యువకుడితో ఆయనకు వ్యక్తిగత వైరం ఉన్నట్టుగా ప్రవర్తించారు. లాఠీతో కసిగా కొట్టారు. తమ పరిస్థితిని అతడు మీడియాకు వివరిస్తుండగా జుట్టు పట్టుకుని పక్కకు లాగిన సదరు అధికారి.. పోలీసుల నుంచి లాఠీ తీసుకుని విచక్షణ రహితంగా చితక్కొట్టారు. మీడియా చిత్రీకరిస్తోందన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోయారు.
దెబ్బలు భరించలేని యువకుడు జాతీయ జెండాను అడ్డం పెట్టుకున్నా వదల్లేదు. పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్పితే అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. యువకుడి చెవి నుంచి రక్తం కారుతున్నా ఆయన ఆపకపోవడం గమనార్హం. పాట్నా అదనపు కలెక్టర్ కేకే సింగ్ యువకుడిని అలా చితకబాదుతున్న వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది.