K Kavitha: ముదురుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం... కల్వకుంట్ల కవితపై పోలీసుల విచారణ జరుగుతోందన్న బీజేపీ ఎంపీ
- తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్
- కవిత పాత్ర లేకపోతే ఎందుకు భయపడుతున్నారంటూ టీఆర్ఎస్ కు ఎంపీ సుధాన్షు ప్రశ్న
- దర్యాప్తు సంస్థల విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్య
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓవైపు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంలో, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ స్కాం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక ఈ స్కాం ఆరోపణల నేపథ్యంలో నిన్న హైదరాబాదులోని కవిత నివాసం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీన్ని నిరసిస్తూ ఈ రోజు ధర్నా చేపట్టిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. దీంతో, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సంజయ్ అరెస్ట్ జరిగిన వెంటనే... బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఢిల్లీలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర లేకపోతే ఎందుకు అంతగా భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో కవిత హస్తంపై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తు సంస్థల విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. దోషులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.