China Cricketers: చైనా క్రికెటర్లను సానబట్టనున్న బెంగాల్ క్రికెట్ సంఘం
- చైనాలోనూ క్రికెట్ పై ఆసక్తి
- చాంగ్ కింగ్ సిటీలో పోటీలు
- బెంగాల్ క్రికెట్ పెద్దలను కలిసిన చైనా బృందం
- త్వరలో ఎంవోయూపై సంతకాలు
- చైనా క్రికెటర్లకు మెరుగైన శిక్షణ ఇస్తామన్న సీఏబీ
ప్రపంచంలోని జనరంజక క్రీడల్లో క్రికెట్ కూడా ఒకటి. క్రమేణా అనేక దేశాల్లో క్రికెట్ ప్రాచుర్యంలోకి వస్తోంది. ఆసియా పెద్దన్న చైనా కూడా క్రికెట్ అంటే మోజు ప్రదర్శిస్తోంది. చైనాలోనూ క్రికెట్ ఆడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడక్కడ పలు నగరాల్లో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. కాగా, చైనాలో క్రికెట్ అభివృద్ధికి బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) ముందుకు వచ్చింది. చైనాలోని చాంగ్ కింగ్ నగరంలో క్రికెటర్లను సానబట్టేందుకు బెంగాల్ క్రికెట్ సంఘం త్వరలోనే చైనా కాన్సుల్ జనరల్ తో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనుంది.
కోల్ కతాలోని చైనా కాన్సుల్ జనరల్ ఝా లియు ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల చైనా బృందం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అవిషేక్ దాల్మియాను ఈడెన్ గార్డెన్స్ లో కలిసింది. అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై చైనా బృందం ప్రతిపాదన చేసింది. చైనా క్రికెటర్లకు కోల్ కతాలో శిక్షణ ఇప్పించడమే ఈ ఒప్పందం వెనుక ప్రధాన ఉద్దేశం.
ఒప్పందం కుదిరితే బెంగాల్ క్రికెట్ సంఘం జట్టుకు, చైనా జట్టుకు మధ్య స్నేహపూర్వక మ్యాచ్ లు, మెరుగైన కోచ్ లతో శిక్షణకు అవకాశం ఉంటుంది. దీనిపై బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా స్పందిస్తూ, చైనా కూడా క్రికెట్ ఆడేలా ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడను విస్తరించడంలో భాగంగా బెంగాల్ క్రికెట్ సంఘం నుంచి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చామని వెల్లడించారు.