Vish Reddy: విజయ్ దేవరకొండ నిజాయతీపరుడైన నటుడు: విష్ రెడ్డి
- ఈ నెల 25న రిలీజ్ కానున్న లైగర్
- విలన్ గా నటించిన విష్ రెడ్డి
- పూరీ కనెక్ట్స్ కు సీఈవోగా వ్యవహరిస్తున్న విష్
- 2018లో మెహబూబా చిత్రంలో నటించిన వైనం
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ చిత్రం ఎల్లుండి (ఆగస్టు 25) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విష్ రెడ్డి నటించాడు. పూరీ దర్శకత్వంలో 2018లో వచ్చిన మెహబూబా చిత్రంలో విష్ రెడ్డి చివరిసారిగా కనిపించాడు. అప్పటినుంచి పూరీ కనెక్ట్స్ చిత్రనిర్మాణ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండతో పోటీపడే సంజు అనే మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) ఫైటర్ గా నటించాడు.
విష్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో తాను చేసే ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని వెల్లడించాడు. విజయ్ ఎంతో నిజాయతీ ఉన్న నటుడు అని, పైగా ఆత్మవిశ్వాసం కలిగినవాడని కొనియాడాడు. విజయ్ ని అందుకే గౌరవిస్తానని విష్ రెడ్డి తెలిపాడు. ఈ సినిమాలో అనేక ట్విస్టులు ఉంటాయని, ప్రధానంగా ఓ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఉంటుందని, ఇప్పుడవన్నీ చెప్పలేనని పేర్కొన్నాడు.
ఇక, లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ తో నటించడం అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి టైసన్ బాక్సింగ్ పోటీలు చూస్తూ పెరిగానని, అలాంటి దిగ్గజంతో కలిసి పనిచేయడం కల నిజమైనట్టుగా ఉందని తెలిపాడు. నిరాడంబరంగా ఉండడం ఎలాగో టైసన్ ను చూసి నేర్చుకోవాలని అన్నాడు.
విష్ రెడ్డి స్వస్థలం చేవెళ్ల మండలం కడుమూరు. తండ్రి వ్యవసాయదారుడు. విష్ రెడ్డి ఎమ్ఎమ్ఏ అంటే ఇష్టంతో ఏడేళ్లుగా మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తున్నాడు. కాలేజీ రోజుల నుంచి పూరీ జగన్నాథ్ చిత్రాలను మిస్ కాకుండా చూసే విష్ రెడ్డి... ఇప్పుడు ఏకంగా పూరీ క్యాంప్ లోనే మకాం వేశాడు.