Pulasa Fish: రెండు కిలోల పులస చేప.. వేలంలో ధర ఎంత పలికిందో తెలిస్తే గుండె గుభేలే!
- యానాం మార్కెట్‌లో మొదలైన పులస చేపల విక్రయాలు
- రూ. 20 వేలకు అమ్ముడుపోయిన చేప
- దక్కించుకున్న భైరవపాలెం వ్యక్తి
గోదావరి నదికి ఎదురీదుతూ వెళ్లే పులస చేపల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటి రుచిని ఒకసారి రుచి చూసిన వారు జీవితంలో మర్చిపోలేరు. అందుకే వాటికి అంత గిరాకీ. అంతేకాదు, పుస్తెలు అమ్మి అయినా పులస తినాలని చెబుతారు. జాలర్ల వలలో ఒక్క చేప పడినా వారి పంట పండుతుంది. దానిని కొనుగోలు చేసేందుకు వందలాదిమంది క్యూకడుతుంటారు. ఏ ఒక్కరికో దానిని అమ్మలేక వేలం పాటలు నిర్వహిస్తుంటారు.
తాజాగా, గోదావరి వరద ఉద్ధృతి తగ్గడంతో మత్స్యకారులకు పులస చేపలు చిక్కుతున్నాయి. దీంతో యానాం మార్కెట్లో వాటి విక్రయాలు మొదలయ్యాయి. నిన్న ఇక్కడ రెండు కిలోల పులస చేపకు వేలం పాట నిర్వహిస్తే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 19 వేలకు నాటి పార్వతి అనే మహిళ ఈ చేపను దక్కించుకుని, అనంతరం భైరవపాలేనికి చెందిన వ్యక్తికి దానిని రూ. 20 వేలకు అమ్మేశారు.
ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధరని మత్స్యకారులు తెలిపారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటలు వేయడం వల్ల సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు చాలా తక్కువగా వస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస’ చేప అంటారు.