Telangana: కోటి బతుకమ్మ చీరలను సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. పంపిణీ ఎప్పటి నుంచి అంటే..!

Telangana govt to distribute 1 crore Bathukamma sarees across State

  • సిరిసిల్ల, కరీనంగర్ లో చీరలు తయారు చేస్తున్న నేత కార్మికులు
  • గడువుకు అనుగుణంగా రోజుకు లక్ష చీరల తయారీ
  • సెప్టెంబర్ మూడో వారలో పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టనున్న యంత్రాంగం

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా స్వల్ప వ్యవధిలో 1.20 కోట్ల జాతీయ జెండాలను అందించిన తెలంగాణ చేనేత జౌళి శాఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు మూడో వారం నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు భాస్తున్నారు. ఇప్పటికే నేత కార్మికులతో కోటి చీరల తయారీకి ఆర్డర్లు ఇవ్వగా, దాదాపు 85 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి.

ఈ చీరలను సిరిసిల్లలో 20 వేల మంది పవర్‌లూమ్ నేత కార్మికులు తయారు చేస్తున్నారు. గడువుకు అనుగుణంగా రోజుకు సుమారు లక్ష చీరలు తయారు చేస్తున్నారని చేనేత జౌళి శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పంపిణీ సమయంలో కొరత లేకుండా చూసేందుకు 3 లక్షల చీరలను బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంచుతామన్నారు.
 
గతేడాది మాదిరిగానే చీరల డిజైన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది 17 రకాల రంగుల్లో 17 రకాల డిజైన్లను నేస్తున్నారు. కోటి చీరలలో  దాదాపు 90 శాతం చీరలు సిరిసిల్లలో తయారవుతుండగా మిగిలినవి కరీంనగర్‌లో తయారవుతున్నాయి. సెప్టెంబర్ 25 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.330 కోట్లు కేటాయించింది.

సిరిసిల్లలో చీరల తయారీ పూర్తయితే వాటిని ఫినిషింగ్, సార్టింగ్, ప్యాకింగ్ కోసం హైదరాబాద్‌కు తరలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం పొందిన తర్వాత జిల్లాలకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. 2017 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన మహిళలకు బతుకమ్మ చీరలను ఏటా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది అత్యధికంగా కోటి చీరలు అందించనుంది. 

ఇక 2017లో 95 లక్షలు, 2018లో 96.7 లక్షలు, 2019లో 96.5 లక్షలు, 2020లో 96.24 లక్షలు, 2021లో 96.38 లక్షలకు పైగా చీరలను పంపిణీ చేశారు. బతుకమ్మ చీరల ద్వారా వాటిని తయారు చేసే చేనేత కార్మికులే కాకుండా కూలీలు, హమాలీలు, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు సహా అనుబంధ కార్మికులు కూడా ప్రభుత్వం జారీ చేసే వీటి ఆర్డర్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు.

  • Loading...

More Telugu News