Heart failure: ఈ సంకేతాలు కనిపిస్తుంటే.. హార్ట్ ఫెయిల్యూర్ సమస్య కావచ్చు!
- శ్వాస ఆడకపోవడం, అలసట అనిపిస్తే నిర్లక్ష్యం వద్దు
- కాళ్లు, పాదాల్లో తరచూ వాపు కనిపిస్తుంటే పరీక్షకు వెళ్లాలి
- గుండె కొట్టుకునే వేగం పెరిగిపోవచ్చు
- గుండె వైఫల్యం తొలి దశలో వికారం సమస్య
నటి సోనాలి ఫోగట్ 42 ఏళ్లకే హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా మరణించారు. నటుడు రాజు శ్రీవాస్తవ 58 ఏళ్లకే తీవ్ర గుండెపోటు బారిన పడి జీవన్మరణం అంచున ఉన్నారు. చిన్న వయసులోనే గుండె వైఫల్యాల కేసులు ఇటీవలి కాలంలో ఎన్నో వెలుగు చూస్తున్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఎలా ఉంటాయి? వీటి తాలూకూ సంకేతాలను ముందే గుర్తించి వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు.
శ్వాస చాలకపోవడం
దీన్నే బ్రీత్ లెస్ నెస్ అంటారు. హార్ట్ ఫెయిల్ అవుతున్నదని చెప్పేందుకు ఇదొక సంకేతం. నడుస్తున్నా, పనిచేస్తున్నా, శరీరాన్ని ముందుకు వంచిన సందర్భాలలో శ్వాసకు ఇబ్బంది ఏర్పడితే (అది శ్వాస ఆడకపోవడం మాదిరి, చాలకపోవడం) దాన్ని గుండె వైఫల్యంగా చూడొచ్చు. తీవ్ర శ్వాస కోస సమస్య ల్లోనూ ఇలా కనిపిస్తుంది. కనుక సమస్య ఏంటన్నది తేలాలంటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే.
అలసట
చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంటే అది కూడా గుండె వైఫల్యం ఛాయలే. పాదాలు, కాళ్లు, మడమల్లో వాపు కనిపించినా కూడా వైఫల్యంగా చూడాలి. రోజులో ఎక్కువ సమయం అలసిపోయినట్టు అనిపిస్తుంటే అది ప్రమాదకర గుండె వైఫల్యం సంకేతమే అయి ఉండొచ్చు. ఆక్సిజన్ ను నింపుకుని ఊపిరితిత్తుల నుంచి వచ్చిన రక్తాన్ని గుండె శరీర మంతటికి పంప్ చేయాలి. అది సమర్థవంతంగా జరగకపోతే శరీరానికి ఆక్సిజన్ లోపిస్తుంది. దాంతో అలసట కనిపిస్తుంది. దీని కారణంగా సాధారణ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
వికారం
గుండె వైఫల్యం ఆరంభ దశలో కడుపులో వికారం, వాంతులు అవుతున్నట్టు అనిపిస్తుంది. కడుపులో అప్ సెట్ గా ఉంటుంది. కండరాలు క్షీణిస్తుంటే గుండె వైఫల్యం పెరుగుతున్నట్టు అనుమానించొచ్చు. ముఖ్యంగా గుండె వైఫల్యం ఎదుర్కొంటున్న మహిళల్లో ఎక్కువ మంది కడుపులో వికారం, గుండె స్పందనల రేటు పెరిగిపోవడం, కడుపులో అప్ సెట్, చెమటలు అధికంగా పట్టడం, డిప్రెషన్, ఆందోళన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
డిప్రెషన్, ఇన్సోమియా, ఆందోళన
గుండె వైఫల్యం బారిన పడిన రోగుల్లో 30 శాతం వరకు డిప్రెషన్, ఆందోళన, ఇన్సోమియా సమస్యలు ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇన్సోమియా అంటే నిద్ర పట్టని సమస్య.
గుండె రేటు
గుండె స్పందనల రేటు పెరిగిపోవడం కూడా హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాల్లో ఒకటి. సాధారణంగా గుండె కొట్టుకునే రేటు 60-100 వరకు ఉంటుంది. 100కు పైన, 60కు దిగువన ఉంటే సమస్యగా భావిస్తారు. గుండె ఫెయిల్యూర్ లో ఈ స్పందనల రేటు అసహజంగా ఉంటుంది.
అయోమయం
గుండె ఫెయిల్యూర్ సమస్య ఉంటే ఏదీ గుర్తుండదు. గందరగోళంగా అనిపిస్తుంది.