Shane Watson: ఆసియాకప్ విజేత ఎవరో చెప్పేసిన షేన్ వాట్సన్!
- ఈ నెల 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం
- 28న ఇండియా-పాక్ ఢీ
- ఈ మ్యాచ్‌లో గెలిచిన వారిదే ఆసియాకప్ అన్న వాట్సన్
- భారత్‌ను నిలువరించడం ఇతర జట్లకు కష్టమేనని అభిప్రాయం
మరో రెండు రోజుల్లో ఆసియాకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈసారి విజేత ఎవరో ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ చెప్పేశాడు. ఆసియా కప్‌లో భారత జట్టుకు ఘన చరిత్ర ఉందని, ఈసారి కూడా టీమిండియానే కప్‌ను కొట్టుకుపోతుందని జోస్యం చెప్పాడు. ఆసియా కప్‌ను భారత్ ఏడుసార్లు గెలుచుకుందని, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిందని గుర్తు చేశాడు. ఈసారి ఆసియాకప్‌ను రోహిత్ శర్మ జట్టు సొంతం చేసుకుంటుందని ఇప్పటికే పలువురు ఓ అంచనాకొచ్చారు. తాజాగా వాట్సన్ కూడా అదే విషయం చెప్పడం గమనార్హం.
భారత జట్టు బలంగా ఉందని, పరిస్థితులకు వారు త్వరగా అలవాటుపడతారని వాట్సన్ అన్నాడు. తన వరకు చెప్పాలంటే ఆసియకప్ విజేత ఇండియానేనని పేర్కొన్నాడు. ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ జట్లు ఈ నెల 28న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకమైనదని వాట్సన్ అభివర్ణించాడు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ట్రోఫీని సొంతం చేసుకుంటారన్న వాట్సన్.. మిగతా జట్లతో పోలిస్తే భారత బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉందన్నాడు.
‘‘భారత్‌ను ఓడించగలమని పాక్ పూర్తి నమ్మకంగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన వారే కప్‌ను సొంతం చేసుకుంటారని నేను భావిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. కానీ, టోర్నీ విజేతగా మాత్రం భారత్ నిలుస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఫైర్ పవర్ ఉందని, కాబట్టి, వారిని నిలువరించడం ఇతర జట్లకు కష్టమైన పనేనని వాట్సన్ వివరించాడు.