Raja Singh: గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్
- రాజా సింగ్‌కు 41 సీఆర్పీసీ నోటీసులు అందజేసిన పోలీసులు
- ఎమ్మెల్యే ఇంటికి మంగళ్ హాట్, షాహినాయత్ గంజ్ పోలీసులు
- ఆరు నెలల క్రితం దాఖలైన కేసుల విషయంలో నోటీసులు
- పోలీసులతో రాజా సింగ్ వాగ్వాదం
- కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్య ప్రాంతానికి రాజా సింగ్ తరలింపు
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. గతంలో రాజా సింగ్‌పై నమోదైన రెండు కేసుల విషయంలో ఆయనకు గురువారం ఉదయం మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా 6 నెలల క్రితం నమోదైన కేసుల విషయంలో ఇప్పుడు నోటీసులు ఎందుకు ఇస్తున్నారంటూ పోలీసులను రాజా సింగ్ నిలదీశారు. అయితే నిబంధనల మేరకే తాము నడుచుకుంటున్నామన్న పోలీసులు తమకు సహకరించాలని రాజా సింగ్‌ను కోరారు.
ఇరు వర్గాల వాదోపవాదాల అనంతరం భారీ సంఖ్యలో బలగాలను రాజా సింగ్ నివాస పరిసరాలకు రప్పించిన పోలీసు ఉన్నతాధికారులు... రాజా సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను అక్కడి నుంచి తరలించారు. నేరుగా మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్‌కు కాకుండా ఓ రహస్య ప్రాంతానికి ఆయనను తరలించినట్లుగా సమాచారం.