K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్... కల్వకుంట్ల కవిత పరువునష్టం దావా నోటీసులపై బీజేపీ ఎంపీ స్పందన
- లిక్కర్ స్కామ్ లో తన పేరు చెప్పిన బీజీపీ నేతలపై కవిత పరువు నష్టం దావా
- స్కామ్ లో ఉన్న వారికి దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు వెళ్తాయన్న బీజేపీ ఎంపీ
- విచారణలో ఎవరి పాత్ర ఏమిటనే విషయం తేలుతుందని వ్యాఖ్య
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీల నేతలకు ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం ఈ స్కాంలో ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మంజీందర్ సిర్సాలు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిపై కవిత పరువునష్టం దావా వేశారు.
ఈ నోటీసులపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పర్వేశ్ వర్మ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులు వేచి చూడాలని... తాను ఎవరి పేరైతే చెప్పానో వారికి నోటీసులు వెళ్తాయని చెప్పారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి దర్యాప్తు సంస్థలు త్వరలోనే నోటీసులు ఇస్తాయని ఆయన తెలిపారు. స్కాంలో ఉన్న వారిని త్వరలోనే విచారణకు పిలుస్తారని... విచారణలో ఎవరి పాత్ర ఏమిటనే విషయం తేలుతుందని అన్నారు.