Raja Singh: రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ కేసు.. చర్లపల్లి జైలుకు తరలింపు
- మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్
- 41 సీఆర్పీసీకి కింద రాజా సింగ్‌కు నోటీసుల అందజేత
- ఆపై ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచిన పోలీసులు
- జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం రాజా సింగ్‌ను ఆయన ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్న మంగళ్ హాట్, షాహినాయత్ గంజ్ పోలీసులు నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో రాజా సింగ్‌కు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు రాజా సింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.
రాజా సింగ్ అరెస్ట్, కోర్టుకు తరలింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భారీ బలగాలను మోహరించారు. బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రాజా సింగ్‌కు 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తొలుత రాజా సింగ్‌ను రహస్య ప్రాంతానికి తరలిస్తున్నట్లుగా చెప్పిన పోలీసులు... ఆ తర్వాత వ్యూహం మార్చి నాంపల్లి కోర్టుకు తరలించారు.