Harika Dronavalli: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన చెస్ ప్లేయర్ ద్రోణవల్లి హారిక
- ఇటీవలే చెన్నైలో ముగిసిన చెస్ ఒలింపియాడ్
- 9 నెలల గర్భంతో పోటీలకు హాజరైన హారిక
- తాజాగా తమకు ఆడ బిడ్డ పుట్టిందని వెల్లడించిన చెస్ క్రీడాకారిణి
9 నెలల గర్భంతో ఇటీవలే తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా జరిగిన అంతర్జాతీయ చెస్ చాంపియన్ షిప్లో ఉత్సాహంగా పాలుపంచుకున్న తెలుగు చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక.. బుధవారం రాత్రి పొద్దుపోయాక పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హారికనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ నెల 24వ తేదీన తమకు ఓ పండంటి ఆడ బిడ్డ పుట్టిందని తెలిపిన హారిక.. తమ కుటుంబంలో మరో బుల్లి రాకుమారి చేరిందని సంతోషం వ్యక్తం చేసింది. తెలుగు సినీ దర్శకుడు బాబీ సోదరుడు కార్తీక్‌ను హారిక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 9 నెలల గర్భంతో తన సోదరుడి భార్య హారిక చెస్ ఒలింపియాడ్‌లో పాలుపంచుకున్న విషయాన్ని దర్శకుడు బాబీ వెల్లడించారు.