Manish Kumar: ఎలాగైనా రైల్వే జాబ్ సాధించాలని... తన బొటనవేలి చర్మం తీసి ఫ్రెండ్ వేలికి అతికించిన ఘనుడు!
- ఇటీవల రైల్వే ఉద్యోగ నియామకాల పరీక్ష
- దరఖాస్తు చేసుకున్న బీహార్ వాసి మనీష్ కుమార్
- తన బదులు స్నేహితుడ్ని పరీక్షకు పంపిన వైనం
- బయోమెట్రిక్ కోసం తన వేలి చర్మం ఇచ్చిన మనీష్
గుజరాత్ లో ఓ యువకుడు రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఏంచేశాడో చూడండి! బీహార్ లోని ముంగేర్ ప్రాంతానికి చెందిన మనీష్ కుమార్ అనే కుర్రాడు రైల్వే శాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. వడోదరలో పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ వచ్చింది. అయితే, పరీక్ష రాసి పాసయ్యేంత శక్తి తనకు లేదని గుర్తించిన మనీష్ కుమార్ మిత్రుడు రాజ్యగురు గుప్తా సాయం కోరాడు. దాంతో మిత్రుడి తరఫున పరీక్ష రాసేందుకు గుప్తా అంగీకరించాడు. అయితే, పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు విధానం ఉండడంతో, మనీష్ కుమార్ ఎవరూ చేయని సాహసానికి ఒడిగట్టాడు.
తన బొటనవేలిని వేడిగా కాలిపోతున్న పెనంపై ఉంచాడు. దాంతో అతడి బొటనవేలి చర్మం ఊడొచ్చింది. ఆ చర్మాన్ని తన మిత్రుడు రాజ్యగురు గుప్తాకు జాగ్రత్తగా ఇచ్చాడు. దాంతో ఆ చర్మాన్ని అందుకున్న గుప్తా... వడోదరలో మనీష్ కుమార్ కు బదులు పరీక్ష రాసేందుకు వెళ్లాడు. అయితే, పరీక్ష కేంద్రం వద్ద అతడి బండారం బయటపడింది.
ఎగ్జామినర్ శానిటైజర్ వేయడంతో, అది చేతులకు రుద్దుకునే క్రమంలో చర్మం ఊడి కిందపడిపోయింది. దాన్ని తీసుకున్న గుప్తా... దాన్ని తిరిగి బొటన వేలికి అతికించుకునే క్రమంలో తడబాటుకు గురయ్యాడు. ఆధార్ బయోమెట్రిక్ వేలిముద్ర వేసే క్రమంలో ఎన్నిసార్లు థంబ్ వేసినా, నిరాకరణకు గురైంది. అతడి ధోరణి అనుమానాస్పదంగా ఉండడంతో ఎగ్జామినర్ పోలీసులకు సమాచారం అందించడంతో అతడి గుట్టురట్టయింది.
విచారణ జరిపిన పోలీసులు మనీష్ కుమార్, రాజ్యగురు గుప్తాలను అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ 465 (ఫోర్జరీ), 419 (మరొకరి వేషంలో మోసగించడం), 120-బి (నేరపూరితమైన కుట్ర) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.