Asia Cup: టీమిండియాను ఓడించడానికి షహీన్ అవసరం లేదు... వీళ్లు చాలు: పాకిస్థాన్ హెచ్ కోచ్ సక్లైన్ ముస్తాక్
- యూఏఈలో రేపటి నుంచి ఆసియా కప్ ప్రారంభం
- గాయం కారణంగా పాక్ జట్టుకు దూరమైన షహీన్ షా అఫ్రిదీ
- పాక్ బౌలర్లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్ మెన్ కు ఛాలెంజేనన్న సక్లైన్ ముస్తాక్
రేపటి నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభం కాబోతోంది. దుబాయ్, షార్జాలు ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నాయి. ఈ టోర్నమెంట్ లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, హాంకాంగ్ దేశాలు ఆడనున్నాయి. మరోవైపు టోర్నీ ప్రారంభం కాకముందే పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశ స్టార్ బౌలర్ షహీన్ షా అఫ్రిదీ గాయపడ్డాడు. దీంతో, అతని స్థానంలో మహ్మద్ హస్నైన్ కి పాక్ జట్టు స్థానం కల్పించింది. మరోవైపు అఫ్రిదీ జట్టుకు దూరమైనంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ దేశ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్ అన్నారు.
ఎలాంటి కఠినమైన ఛాలెంజ్ లనైనా ఎదుర్కొనేలా ఎన్నో రోజుల నుంచి తాము జట్టును సిద్ధం చేసుకున్నామని సక్లైన్ చెప్పారు. అవసరాలకు తగ్గట్టుగా వికెట్లు తీయగల సమర్థులైన బౌలర్లు తమకు ఉన్నారని తెలిపారు. తమ బౌలింగ్ యూనిట్ పై తనకు, కెప్టెన్ బాబర్ ఆజమ్ కే కాకుండా జట్టు మొత్తానికి నమ్మకం ఉందని చెప్పారు.
షహీన్ ఉంటే తమ బౌలింగ్ యూనిట్ అత్యంత పటిష్ఠంగా ఉండేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని... అయితే, అతను లేకపోయినా భారత బ్యాట్స్ మెన్లను వణికించగల బౌలర్లు పాక్ జట్టులో ఉన్నారని అన్నారు. మహ్మద్ హస్నైన్, నజీమ్ షా, హరీస్ రౌఫ్ లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సామర్థ్యం ఈ ముగ్గురు బౌలర్లకు ఉందని అన్నారు. పాక్ బౌలర్లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్ మెన్ కు ఛాలెంజేనని చెప్పారు. మరోవైపు, టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆదివారం (28వ తేదీ) పాకిస్థాన్ తో ఆడబోతోంది.