Asthma: వానాకాలంలో ఆస్తమా పేషెంట్లకు ఉపశమనం ఇచ్చే 9 ఆహార పదార్థాలు ఇవిగో..!

 Here are 9 food items that give relief to asthma patients in monsoon weather

  • వానాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ పరిస్థితులతో ఆస్తమా పేషెంట్లకు ఇబ్బంది
  • ఆస్తమా లక్షణాలను తగ్గించే ఆహారంపై దృష్టి పెట్టాలని నిపుణుల సూచన
  • అల్లం, పసుపు, మొక్కజొన్న వంటి వాటితో కొంత వరకు ఉపశమనమని వెల్లడి

కారణాలు ఏమైనా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఏడాదిలో చాలా కాలం బాగానే ఉన్నా.. చలికాలంలో, అప్పుడప్పుడు వానాకాలంలో ఆస్తమా విజృంభిస్తుంటుంది. దానితో బాధపడుతున్నవారు ఇబ్బంది పడుతుంటారు. 

నిజానికి ఆస్తమా ఒకసారి వచ్చిందంటే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అలవాట్లు చేసుకోవడం, తీసుకునే ఆహారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం ఉంటుందని వివరిస్తున్నారు. ప్రస్తుతం వానాకాలంలో ఆస్తమా బాధితులు ఈ తొమ్మిది రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.

1. అల్లం
  అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఇది తోడ్పడుతుందని ఇప్పటికే గుర్తించారు. ఇక ఊపిరితిత్తుల్లో నిండిపోయే ద్రవాలను తొలగించడంలోనూ అల్లం బాగా పనిచేస్తుందని.. ఆస్తమాతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపశమనం ఇస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. నీటిలో అల్లాన్ని వేసి మరిగించి.. నిమ్మ రసం వంటివి కలుపుకొని తాగడం వల్ల ప్రయోజనం ఎక్కువని పేర్కొంటున్నారు. 

2. వెల్లుల్లి
జలుబు లక్షణాలను తగ్గించడంలో వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎంతగానో తోడ్పడుతాయి. వెల్లుల్లిని ఉడికించడం కంటే.. ముడిరూపంలోనే తీసుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఒక వెల్లుల్లి రెబ్బను చిన్న ముక్కలుగా చేసి.. ఓ గ్లాసు నీటితో తీసుకోవాలని వివరిస్తున్నారు.

3. పసుపు
 మన దేశంలో వంటల్లో పసుపు వినియోగం ఎక్కువే. దీనిలో ఉండే కర్క్యుమిన్ అనే రసాయనం అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. శరీరానికి సోకే ఇన్ ఫెక్షన్లతో పోరాడటానికి ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు. పసుపును పాలలో వేసి మరిగించుకుని తీసుకోవడం ద్వారా కర్క్యుమిన్ శరీరానికి ఎక్కువగా అందుతుందని సూచిస్తున్నారు.

4. గ్రీన్ టీ
యాంటీ ఆక్సిడెంట్లకు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలున్న రసాయనాలకు గ్రీన్ టీ పేరెన్నికగన్నది. ఈ రెండూ ఆస్తమా లక్షణాలను తగ్గించడానికి తోడ్పడుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

5. ఉడకబెట్టిన కూరగాయలు
కూరగాయల్లోని పలు రకాల పదార్థాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పుడుతాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలను పచ్చిగాగానీ, ఉడికీ ఉడకనట్టుగా గానీ తింటే లాభం ఉండదని, పైగా వాటి వల్ల వైరస్ లు, ఇతర సూక్ష్మజీవుల బారినపడే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వీలైతే ఆవిరిపై ఉడకబెట్టిన కూరగాయలను సలాడ్ గా చేసుకుని తింటే.. త్వరగా అరగడంతోపాటు పోషకాలు అందుతాయని వివరిస్తున్నారు.

6. పెరుగు
పాలకు బదులుగా పెరుగును మన ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగు, బట్టర్ మిల్క్ వంటి వాటిలో ఉండే ప్రో బయాటిక్ బ్యాక్టీరియా.. శరీరంలో జీర్ణశక్తిని పెంపొందించేందుకు, అదే సమయంలో రోగనిరోధక శక్తి మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని వివరిస్తున్నారు.

7. మొక్కజొన్న  
వానాకాలంలో ఎక్కడ చూసినా మొక్కజొన్న కంకులు కాల్చి అమ్ముతూ వుంటారు. మొక్కజొన్నలో విటమిన్ బీ6, ఫోలిక్ యాసిడ్, జింక్, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగిన శక్తి అంది.. రోగ నిరోధక శక్తి బలపడుతుంది. ఆస్తమా కారణంగా ఏర్పడే ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

8. ఉసిరి కాయలు (గూస్ బెర్రీస్) 
శరీరంలో శ్వాస వ్యవస్థ బాగా పనిచేసేందుకు, రోగ నిరోధక శక్తి బలపడేందుకు విటమిన్ సి ఎంతో అవసరం. ఉసిరి కాయల్లో విటమిన్ సి అత్యధిక మోతాదులో ఉంటుంది. ఆరు బత్తాయి పండ్లలో ఉండేంత విటమిన్ సి ఒక్క ఉసిరికాయలోనే ఉంటుంది. అందువల్ల వర్షాకాలంలో తరచుగా ఉసిరికాయలు తినడం వల్ల లాభం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

9. మిరియాలు
మిరియాల్లో పిపరైన్ అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరానికి తీవ్రంగా హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. ఆస్తమా బాధితుల్లో వర్షాల కారణంగా నెలకొనే ఎలర్జీ లక్షణాలను, ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు కూడా పిపరైన్ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆస్తమా బాధితులు చల్లటి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆహారంలో మార్పులు చేసుకున్నా.. అవసరమైన మందులను వాడటం, చలి, దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం చర్యలు తీసుకోవడం మాత్రం అనుసరించాలని సూచిస్తున్నారు. ఆహారానికి సంబంధించి కూడా కొందరికి ఎలర్జీలు ఉండవచ్చని.. అందువల్ల వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News