Hyderabad: రెండు పిరియడ్ల పాటు గది బయట నిలబెట్టిన టీచర్.. మనస్తాపంతో ఉరేసుకున్న 8వ తరగతి బాలిక

Girl committed suicide after teacher stands her outside school

  • హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఘటన
  • బయట నిల్చోబెట్టడంతో మనస్తాపం
  • సాయంత్రం ఇంటికెళ్లాక ఉరివేసుకున్న బాలిక
  • స్కూలు వద్ద బాధిత తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన

తరగతి గదిలో టీచర్ విధించిన శిక్షకు మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బంజారా కాలనీకి చెందిన కరంటోతు అక్షయ (13) రాఘవేంద్ర నగర్‌లోని శాంతినికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. 

గురువారం స్కూలుకు వెళ్లిన అక్షయ, ఆమె స్నేహితురాలు రోజూ కూర్చునే చోట కాకుండా వేరే చోట కూర్చున్నారు. గమనించిన ఉపాధ్యాయుడు ప్లేస్ ఎందుకు మార్చారని ప్రశ్నిస్తూ తరగతి నుంచి బయటకు పంపి నిల్చోబెట్టారు. ఆ తర్వాత వచ్చిన మరో టీచర్ బయట నిల్చున్న బాలికలను ఇక్కడెందుకు నిల్చున్నారని ప్రశ్నించి లోపలికి పంపారు. 

ఆ తర్వాత కాసేపటికే మళ్లీ వచ్చిన మొదటి ఉపాధ్యాయుడు క్లాసులోకి ఎందుకు వచ్చారని వారిని ప్రశ్నించాడు. విషయం చెప్పారు. దీంతో ఆయన వారిని లోపలికి వెళ్లమని పంపిన ఉపాధ్యాయుడిని కలిసి అడగడంతో తాను అలా చెప్పలేదని ఆయన మాట మార్చారు. దీంతో ఆయన బాలికలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరినీ రెండు పిరియడ్ల పాటు బయట నిల్చోబెట్టారు.

సాయంత్రం బడి వదిలిపెట్టాక అక్షయ ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులు లక్పతి, సరిత ఊరెళ్లడంతో బాలిక ఒక్కతే ఉంది. జరిగిన ఘటనను తలచుకుని కుమిలిపోయింది. కాసేపటికి తండ్రి లక్పతి ఫోన్ చేస్తే కుమార్తె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పక్కింటి వారికి ఫోన్ చేసి చూడమని చెప్పగా వారెళ్లి చూసి హతాశులయ్యారు. బాలిక ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. విషయం చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. సీలింగ్‌కు అచేతనంగా వేలాడుతున్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు.

తన కుమార్తె మృతికి ఉపాధ్యాయుడే కారణమంటూ స్కూలుకు చేరుకుని ఆందోళనకు దిగారు. పాఠశాల భవనం అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News