Kuwait: ప్రవాసులకు షాకిచ్చే మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్న కువైట్

Kuwait new decision not to give medical treatment to foreigners in govt hospitals

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవాసులకు చికిత్స బంద్
  • ప్రవాసులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిందే
  • ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ప్రవాసులకు మాత్రం కొంత కాలం వెసులుబాటు

తమ దేశంలో పని చేస్తున్న ప్రవాసుల పట్ల ఇటీవలి కాలంలో కువైట్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. క్రమంగా ప్రవాసులకు ప్రాధాన్యతను తగ్గించే విధంగా అడుగులు వేస్తోంది. తమ దేశంలో వలసదారుల ప్రభావాన్ని క్రమంగా తగ్గించే విధంగా వ్యవహరిస్తోంది. ప్రైవేట్ రంగంలో సైతం ప్రవాసులకు ఉద్యోగావకాశాలను తగ్గించేస్తోంది. వలసదారుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు గత ఐదేళ్లుగా ఆ దేశం కువైటైజేషన్ పాలసీని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ స్థానికులతో నింపే ప్రయత్నాలు చేస్తోంది. 

తాజాగా కువైట్ మరో కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం కువైటీలకు మాత్రమే చికిత్స అందించాలని ఆదేశించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రవాసులందరూ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే ప్రవాసులను ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్ లకు బదులుగా ధామస్ లోని ప్రైవేట్ హెల్త్ హాస్పిటల్ కంపెనీకి తరలిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ సెక్టార్ లో పని  చేస్తున్న కార్మికులందరినీ పూర్తిగా ధామస్ సెంటర్ కే పరిమితం చేయబోతున్నారు. 

అయితే, ప్రస్తుతం ప్రభుత్వ సెక్టార్ లో పని చేస్తున్న ప్రవాసులకు మాత్రం కొంత వెసులుబాటు కల్పించారు. వీరు మరికొంత కాలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు అవకాశం కల్పించారు. తీవ్ర అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య చికిత్సలు కావాల్సిన వారికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందించనున్నారు. కువైట్ లో భారతీయులు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

  • Loading...

More Telugu News