Raghu Rama Krishna Raju: హేమంత్ సోరెన్‌పై వేటేస్తే జగన్‌కూ ఇబ్బందే: రఘురామకృష్ణరాజు
- జగన్ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్న రఘురామరాజు
- మూడున్నరేళ్లలో సాక్షి పత్రికకు రూ. 200 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారని ఆరోపణ
- శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాయన్న నరసాపురం ఎంపీ
- రాష్ట్రపతి పాలన తప్పకపోవచ్చని వ్యాఖ్య
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తే కనుక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం హేమంత్ సోరెన్ చేసింది కనుక తప్పే అయితే, అంతకుమించిన అవినీతి, అక్రమాలకు పాల్పడిన జగన్ కూడా తప్పించుకోలేరని అన్నారు. తన సొంత కంపెనీ అయిన సరస్వతీ పవర్ కంపెనీకి సీఎంగా జగన్ అనుమతులు ఇచ్చారని, సాక్షి దినపత్రికకు ఈ మూడున్నరేళ్లలో రూ. 200 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారని రఘురామ ఆరోపించారు.
బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ గతంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని శ్రీకృష్ణుడు.. శిశుపాలుడి వంద తప్పుల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారని గుర్తు చేసిన రఘురామరాజు.. శిశుపాలుడికి ఇక శిరచ్ఛేదం తప్పకపోవచ్చని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల తీరు ఇలానే కొనసాగితే రాష్ట్రపతి పాలన తప్పకపోవచ్చని అన్నారు. కుప్పంలో ప్రజాచైతన్యాన్ని చూసిన తర్వాత కూడా పోలీసులు తన చేతిలో ఉన్నారని, కేసులు పెడతానంటే వ్యవస్థలు చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.