Bobburi Vengala Rao: ఏపీ సీఐడీపై తీవ్ర ఆరోపణలతో మెజిస్ట్రేట్ కు యూట్యూబ్ నిర్వాహకుడు వెంగళరావు వాంగ్మూలం
- 'ఘర్షణ' యూట్యూబ్ నిర్వాహకుడు బొబ్బూరి వెంగళరావును అరెస్ట్ చేసిన సీఐడీ
- టార్చర్ పెట్టారంటూ మేజిస్ట్రేట్ కు వెంగళరావు వాంగ్మూలం
- రఘురామకృష్ణరాజుకే దిక్కులేదు.. నిన్ను కొడితే కోర్టులు ఏం చేస్తాయన్నారని చెప్పిన వెంగళరావు
ప్రభుత్వంపై దుష్ప్రచారంతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడన్న ఆరోపణలపై 'ఘర్షణ' యూట్యూబ్ నిర్వాహకుడు బొబ్బూరి వెంగళరావును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు బస్సులో వస్తుండగా... కోదాద వద్ద ఆయనను అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఆయనను నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు.
ఆ తర్వాత ఆయకు ప్రాథమిక వైద్య పరీక్షలను నిర్వహించి... నిన్న రాత్రి గుంటూరు ఆరో అదనపు మేజిస్ట్రేట్ శృతి ఎదుట ఆమె నివాసంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వెంగళరావు ఇచ్చిన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ శృతి నమోదు చేసుకున్నారు.
వెంగళరావు ఇచ్చిన వాంగ్మూలంలోని ప్రధానాంశాలు:
తన రెండు చేతులను పైకి కట్టేసి, వాటి మధ్యలో కర్ర పెట్టి, అరికాళ్లపై కొట్టారని మేజిస్ట్రేట్ కు వెంగళరావు చెప్పారు. బల్లపై పడుకోబెట్టి, తన నడుంపై కూర్చొని, కాళ్లు పైకి ఎత్తి కొట్టారని తెలిపారు. తన వృషణాల్లో కూడా పొడిచే ప్రయత్నం చేశారని తెలిపారు.
ఎంపీ రఘురామకృష్ణరాజును కొడితేనే దిక్కులేదు... నిన్ను కొడితే కోర్టులు ఏం చేస్తాయని సీఐడీ పోలీసులు అన్నారని చెప్పారు. నిన్ను కొట్టిన విషయాన్ని కోర్టుకు చెప్పకూడదని, ఒకవేళ చెపితే బయటకు వచ్చాక నిన్ను చంపినా కోర్టులు ఏమీ చేయలేవని హెచ్చరించారని అన్నారు. తాము చెప్పినట్టు వింటేనే బతుకుతావని... లేకపోతే నీతో పాటు నీ కుటుంబం కూడా మిగలదని వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. తనను కొట్టిన తర్వాత ఒక కాగితంపై సంతకం చేయించుకున్నారని... ఆ కాగితంలో ఉన్న విషయాలు వాస్తవాలు కాదని తెలిపారు.
తాము కొట్టామని మేజిస్ట్రేట్ కు చెపితే నీకు బెయిల్ కూడా రాదని, కొట్టలేదని చెపితేనే బెయిల్ వస్తుందని చెప్పారని వెంగళరావు తెలిపారు. సీఐడీ అధికారులు తనను కొట్టారని రెండు నెలల క్రితం న్యాయమూర్తితో వెంకటేశ్ అనే వ్యక్తి చెప్పాడని... ఆయనకు బెయిల్ రావడానికి రెండు నెలలు పట్టిందని చెప్పారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ వీడియోల్లో మాట్లాడితే చంపేస్తామని సీఐడీ అధికారులు హెచ్చరించారని చెప్పారు.
కావాలనుకుంటే వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేయాలన్నారని తెలిపారు. తాము చెప్పినట్టు వినకుంటే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చంపేస్తామని హెచ్చరించారని చెపుతూ కంటతడి పెట్టుకున్నారు. మేము కొట్టినట్టు బయట చెప్పినా ఎవరూ నమ్మరని... ఒంటిపై గాయాలు లేకుండా కొట్టడమే తమ ట్యాలెంట్ అని చెప్పారని తెలిపారు. తనకు భార్య, రెండేళ్ల కుమారుడు, 60 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులు ఉన్నారని... తనను చంపేస్తే తన కుటుంబం రోడ్డున పడుతుందని చెప్పారు.
వెంగళరావు ఇచ్చిన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ శృతి నమోదు చేశారు. సీఐడీ పోలీసులు కొట్టిన గాయాలను మేజిస్ట్రేట్ కు వెంగళరావు చూపించారు. దీంతో, ఆయనకు తిరిగి వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆమె ఆదేశించారు. దీంతో, రాత్రి 11.55 గంటల సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను జీజీహెచ్ కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్ లో జడ్జికి అందజేయనున్నారు. మరోవైపు వెంగళావుపై సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.