Man: ఆపరేషన్ చేయించుకుని కారు తాళాన్ని చేతికి పెట్టించేసుకున్నాడు.. కీ మర్చిపోయే పనేలేకుండా ఓ యూట్యూబర్ చిత్రమైన పని.. వీడియో ఇదిగో
- టెస్లా ఎలక్ట్రిక్ కారుకు వినియోగించే ఆధునిక చిప్ ఆధారిత ఆటోమేటిక్ కీ
- చేతి మణికట్టు పైభాగంలో ఆపరేషన్ చేసి పెట్టించుకున్న యూట్యూబర్
- కారు డోర్ వద్ద చేతిని ట్యాప్ చేయగానే అన్ లాక్ అయ్యేందుకు వీలు
కారో, బైకో ఏదైతేనేం.. అప్పుడప్పుడూ తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం. ఒక్కోసారి వెతికివెతికి చిరాకు కూడా వేస్తుంటుంది. మరి ఈ తంటా ఎందుకు అనుకున్నాడో ఏమో అమెరికాకు చెందిన యూట్యూబర్ బ్రాండన్ దలాలీ చిత్రమైన పని చేశాడు. ఆపరేషన్ చేయించుకుని కారు తాళం చేతికి పెట్టించేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.
ఎలక్ట్రానిక్ కీ అవడంతో..
- బ్రాండన్ వాడేది టెస్లాకు చెందిన ఆధునిక ఎలక్ట్రిక్ కారు. దానికి ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ కీ ఉంటుంది. దాన్ని ఇన్ సర్ట్ చేయాల్సిన పని ఉండదు. కేవలం కారు డోర్ వద్ద ట్యాప్ చేస్తే అన్ లాక్ అవుతుంది.
- కారు లోపల కూడా ఆ కీని ఉపయోగించే స్టార్ట్ చేయడం, ఇతర పనులు చేయడం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే బ్రాండన్ సదరు ఎలక్ట్రానిక్ కీని తన కుడి చేతి మణికట్టు పై భాగంలో చిన్న ఆపరేషన్ చేయించుకుని ఫిట్ చేయించేసుకున్నాడు.
- ఇందుకోసం సదరు వైద్య నిపుణుడికి 400 డాలర్లు (మన కరెన్సీలో రూ.32 వేలు) చెల్లించాడు.
- కారు దగ్గరికి వెళ్లిన బ్రాండన్ కేవలం తన చేతి మణికట్టును డోర్ కు దగ్గరగా అటూ ఇటూ కదిలిస్తే అన్ లాక్ అయిపోయింది.
- కారు లోపల కూడా సెన్సర్లు ఉన్న భాగంలో తన చేతిని పెట్టగానే స్టార్ట్ అవడం, ఆఫ్ అయిపోవడం, ఇతర పనులు చేయడం జరిగిపోయింది.
- బ్రాండన్ ఇలా చిప్ ఆధారిత లాకింగ్ సిస్టమ్ లు పెట్టించుకోవడం ఇదే తొలిసారి కాదట. తన ఇంటి మెయిన్ డోర్ లాక్ తన ఎడమ చేయిలో ఉంటుందని బ్రాండన్ చెబుతున్నాడు.