Rain: తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఏ రోజు ఎక్కడెక్కడ వానలు పడేదీ వాతావరణ శాఖ సూచనలివీ
- 27న దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా వానలు
- 28న హైదరాబాద్ సహా సెంట్రల్ తెలంగాణలో భారీ వర్షాలు
- 29న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వానలు పడతాయని వెల్లడి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని.. దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. పలు జిల్లాల్లో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది, సోమవారాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు తమ ట్విట్టర్ ఖాతాలో వర్షపాతం అంచనాల మ్యాప్ లను విడుదల చేసింది.
- శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.
- ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు.. జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ అర్బన్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
- సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్ అర్బన్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.