Manish Sisodia: అక్కడ ఏమీ దొరక్కపోవడంతో.. ఇప్పుడు బీజేపీ ఢిల్లీ పాఠశాలలపై దృష్టి సారించింది: మనీశ్ సిసోడియా
- ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీబీఐ ఏమీ కనిపెట్టలేకపోయిందన్న మనీశ్
- అందుకే ఢిల్లీ స్కూళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కొత్త పల్లవి అందుకున్నారని వ్యాఖ్య
- 2015 నుంచి తమ ప్రభుత్వం 700 స్కూలు భవనాలను నిర్మించిందని వెల్లడి
బీజేపీ నిరక్షరాస్యులతో కూడిన పార్టీ అని... అందుకే దేశాన్ని కూడా నిరక్షరాస్యతలో మగ్గేలా చేయాలనుకుంటోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని చెప్పారు. ఢిల్లీ పాఠశాలలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విచారణలో ఏమీ కనిపెట్టలేక పోవడంతో ఢిల్లీ పాఠశాలల అంశాన్ని బీజేపీ తలకెత్తుకుందని ఆయన విమర్శించారు.
లిక్కర్ పాలసీ విషయంలో సీబీఐ 10 రోజుల పాటు దాడులు చేసి ఏం కనిపెట్టిందని సిసోడియా ప్రశ్నించారు. అక్కడ ఏమీ కనిపెట్టలేకపోవడంతో స్కూళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కొత్త పాల్లవి అందుకున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంపై సీబీఐ తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. 2015 నుంచి తమ ప్రభుత్వం 700 కొత్త స్కూలు భవనాలను నిర్మించిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలు ప్రైవేట్ పాఠశాలలకు పోటీని ఇస్తున్నాయని అన్నారు.