Anthrax: మన్యంలో ‘ఆంత్రాక్స్’.. పాడేరులో ఏడుగురు చిన్నారుల్లో కనిపించిన లక్షణాలు
- దొరగుడ గ్రామంలో ఏడుగురు చిన్నారుల్లో లక్షణాలు
- ఆంత్రాక్స్‌తో చనిపోయిన మేక మాంసం తినడం వల్లేనన్న వైద్యులు
- నమూనాలు సేకరించి పరీక్షలకు కోసం విశాఖకు పంపిన అధికారులు
మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ లక్ష్మీపురం పంచాయతీలోని దొరగుడ గ్రామంలో పలువురు చిన్నారులు ఈ వ్యాధి బారినపడ్డారు. ఆంత్రాక్స్‌తో చనిపోయిన మేక మాంసాన్ని తిన్న వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. వ్యాధి బారినపడిన ఏడుగురు చిన్నారులు 5 నుంచి 13 ఏళ్లలోపు వారేనని పేర్కొన్నారు. బాధిత చిన్నారుల శరీరంపై పొక్కులు, కురుపులు వచ్చినట్టు చెప్పారు. ఇక్కడ చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదని, వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని వైద్యులు వివరించారు.
పాడేరు డివిజన్‌లో గతంలోనూ ఆంత్రాక్స్ కేసులు వెలుగుచూశాయి. 2009లో 12 అనుమానిత కేసులను గుర్తించగా 76 మందికి ఆంత్రాక్స్ సోకినట్టు నిర్ధారణ అయింది. వారిలో ముగ్గురు మరణించారు. ఆ తర్వాత మళ్లీ 2013లో ఇద్దరు, 2015లో ఆరుగురిలో ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించినా వ్యాధి నిర్ధారణ కాలేదు. అయితే, ఆ తర్వాత 2016లో 38 కేసులు నమోదు కాగా 10 మంది, 2017లో 21 కేసులు వెలుగు చూడగా 14 మంది, 2018లో 18 కేసుల్లో ఒక్కరు ఈ వ్యాధి బారినపడ్డారు.
తాజాగా మరోసారి ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించడంతో వారి నుంచి నమూనాలు సేకరించి విశాఖపట్టణం పంపారు. ఆంత్రాక్స్ వ్యాధి ఒక ప్రాంతంలో ఒకసారి వ్యాపిస్తే 60 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ వ్యాధితో చనిపోయిన జీవాల మృతకళేబరాలను పూర్తిగా పూడ్చాలి. వాటిని సరిగా పూడ్చకపోతే వాటి నుంచి సూక్ష్మక్రిములు బయటకు వచ్చి నేలలో ఏళ్ల తరబడి ఉండిపోతాయి. ఆపై ఆ ప్రాంతంలోని నీరు, గాలి, గడ్డి ద్వారా పరిసరాల్లోని మనుషులు, పశువులకు వ్యాపిస్తుంది.