Noida: నేడు 12 సెకన్లలో కూలనున్న సూపర్‌టెక్ ట్విన్ టవర్స్.. ఆసక్తికర అంశాలు ఇవే!
- సరిగ్గా 2.30 గంటలకు నేలమట్టం కానున్న జంట భవనాలు
- భవనాల కూల్చివేతకు 3,700 కేజీల పేలుడు పదార్థాలు
- వేలాదిమందిని ఖాళీ చేయిస్తున్న అధికారులు
- ఆసుపత్రులను అప్రమత్తం చేసిన అధికారులు
- భవనాలకు 50 మీటర్ల దూరంలో బారికేడ్ల ఏర్పాటు
ఇప్పుడు దేశం దృష్టి మొత్తం నోయిడాలోని ట్విన్‌టవర్స్‌పైనే ఉంది. సూపర్‌టెక్ సంస్థ నిర్మించిన ఈ జంట టవర్ల కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. నేటి మధ్యాహ్నం సరిగ్గా 2.30 గంటలకు అందరూ చూస్తుండగానే క్షణాల వ్యవధిలోనే నేలమట్టం కానున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ భవనాలను కూల్చివేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం భవనాల వద్దకు చేరుకున్న పోలీసులు ఈ భవనాలున్న ఎమరాల్డ్ కోర్టు సొసైటీలోని వేలాదిమందిని ఖాళీ చేయిస్తున్నారు.
కూల్చివేతకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు
1. సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్చివేతకు సిద్ధమైన అధికారులు.. భవనాల కూల్చివేతకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగిస్తారు. ఈ ఉదయం నుంచే కూల్చివేత పనుల పర్యవేక్షణ ప్రారంభమైంది.
2. ఈ ట్విన్ టవర్ల పేర్లు అపెక్స్.. సేయాన్. పేలుడు పదార్థాలతో కూల్చివేస్తున్న దేశంలోనే ఎత్తైన భవనాలు ఇవి. కేవలం 12 సెకన్లలోనే ఇవి నేలమట్టం కానున్నాయి.
3. భవనాలకు 50 మీటర్ల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అటువైపు రాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.
4. ఎడిఫిస్ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన ఉత్కర్ష్ మెహతా మాట్లాడుతూ.. ఈ విషయంలో తాను కూడా కొంత నెర్వస్‌గా ఉన్నట్టు చెప్పారు. పేలుళ్లు ప్రణాళిక ప్రకారం జరుగుతాయని వందశాతం విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆందోళన వద్దని గత ఆరు నెలలుగా చెబుతున్నామని, ఈ రోజూ అదే విషయం చెప్పామని అన్నారు.
5. ఎమరాల్డ్ కోర్టు సొసైటీ నుంచి ఈ ఉదయం అధికారులు ఖాళీ చేయించిన కుటుంబాల్లో మను సోని కుటుంబం కూడా ఉంది. ఈ సందర్భంగా మను సోని మాట్లాడుతూ.. ట్విన్ టవర్స్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న సిల్వర్ సిటీ అపార్ట్మెంట్లోని తన కుటుంబ స్నేహితుల ఇంటికి వెళ్తున్నామని అన్నారు. కూల్చివేతను తాము టీవీలోనే చూస్తామని, బాల్కనీలోంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
6. మను కుటుంబం ఈ తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేచి సొసైటీ నుంచి బయటకు వచ్చింది. ఇంకా 20 శాతం మంది మాత్రమే సొసైటీలో ఉన్నారని పేర్కొన్నారు. తాము నిద్రలేచి, టీ తాగి, ఫ్రెషప్ అయ్యి ఉదయం 7 గంటలకు బయలుదేరినట్టు చెప్పారు.
7. ఉదయాన్నే జంతు సంరక్షణ సంస్థలు సొసైటీకి చేరుకుని అక్కడ శునకాలు, ఇతర పెంపుడు జంతువులను తరలించారు. భవనాల కూల్చివేత సమయంలో అక్కడ జంతువులు లేకుండా జాగ్రత్త పడ్డారు.
8. ఎమరాల్డ్ కోర్ట్ ట్విన్ టవర్లలోని ఫ్లాట్ల కొనుగోలుదారులకు డబ్బులు తిరిగి చెల్లించేందుకు అక్టోబరులోగా టైమ్‌లైన్‌ను సిద్ధం చేయాలని సూపర్‌టెక్ గ్రూపును శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
9. గతేడాది ఆగస్టులోనే భవనాల కూల్చివేతకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అందులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి 12 శాతం వడ్డీతో కలిపి అసలు చెల్లించాలని ఆదేశించింది.
10. నగరంలోని ముఖ్యమైన రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. జేపీ ఆసుపత్రి, ఫెలిక్స్ ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే చికిత్స అందించేలా వాటిని సిద్ధం చేశారు.