Swine flu: హైదరాబాద్ పై మళ్లీ స్వైన్ ఫ్లూ పంజా

Swine flu strikes again after 3 years in Hyderabad

  • నెల రోజులుగా వెలుగు చూస్తున్న కేసులు
  • ప్రతి వారం 15కు తక్కువ కాకుండా నమోదు
  • ప్రభుత్వ విభాగంలో ఫీవర్ ఆసుపత్రిలోనే హెచ్1ఎన్1 పరీక్షలు

మూడేళ్ల విరామం తర్వాత భాగ్యనగరంలో మళ్లీ స్వైన్ ఫ్లూ జడలు విప్పుకుంది. నగరవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారిక సమాచారం ప్రకారం.. నెల రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూస్తున్నాయి. సగటున ప్రతి వారం 15 కేసులు వస్తున్నాయి. అయితే, అన్ని హాస్పిటల్స్ లో స్వైన్ ఫ్లూ టెస్ట్ లు చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన అనుమానిత కేసులను ఫీవర్ హాస్పిటల్ కు రిఫర్ చేస్తున్నారు. అక్కడ రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కు పంపిస్తున్నారు.

చాలా కేసుల్లో శ్వాసకోశ పరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయని వైద్య వర్గాలు అంటున్నాయి. కేసుల్లో స్పష్టమైన పెరుగుదల ఉందని, అయితే వాస్తవ కేసులను అధికారిక గణాంకాలు ప్రతిఫలించలేకపోవచ్చని చెబుతున్నాయి. ఎందుకంటే అన్ని చోట్లా హెచ్1ఎన్1 పరీక్షలు చేయడం లేదని వెల్లడించాయి. శ్వాస కోస సమస్యలు కనిపిస్తుండడంతో ఆర్టీపీసీఆర్ వరకే చేస్తున్నారు. స్వైన్ ఫ్లూను మొదటిసారి 2009లో గుర్తించారు. 2019లో దీన్ని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. 

స్వైన్ ఫ్లూలో జ్వరం, చలి, దగ్గు, గొంతులో మంట, ముక్కు కారడం, కళ్లు ఎర్రబారడం, వళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట, వాంతులు వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇవే లక్షణాలు ఇతర ఫ్లూ వైరస్ లలో, కరోనాలోనూ కనిపిస్తున్నాయి కనుక అయోమయం నెలకొంది. అందుకే అన్ని చోట్లా స్వైన్ ఫ్లూ గా అనుమానించి హెచ్1ఎన్1 పరీక్షలు చేయడం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. తీవ్రమైన శ్వాసకోస సమస్యలు విడవకుండా ఇబ్బంది పెడుతుంటే వైద్యులను వెంటనే సంప్రదించాలని సూచిస్తున్నారు.  


  • Loading...

More Telugu News