Telangana: తెలంగాణలో మొదలైన కానిస్టేబుల్ రాత పరీక్ష... ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించని అధికారులు
- ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం
- నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారుల సూచన
- ఆలస్యంగా వచ్చిన పలువురిని అనుమతించని వైనం
- రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఈ తరహా ఘటనలు
తెలంగాణ పోలీసు శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా కీలకమైన రాత పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష ప్రారంభం కాగా... నిబంధనల మేరకు నిర్దేశిత సమయానికి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు అధికారులు షాకిస్తూ పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరించారు. దీంతో ఎంతోకాలంగా పరీక్షకు సిద్ధపడుతూ వచ్చిన చాలా మంది అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు.
కానిస్టేబుల్ రాత పరీక్షకు నిర్దేశిత సమయాని కంటే గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఉన్నతాధికారులు ఇదివరకే అభ్యర్థులకు సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిర్దేశిత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా పరీక్షకు అనుమతించేది లేదని కూడా ప్రకటించారు. ఈ ఆదేశాలను పాటించిన మెజారిటీ అభ్యర్థులు నిర్దేశిత సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు వచ్చినా... వివిధ కారణాల రీత్యా కొందరు ఆలస్యంగా వచ్చారు. ఇలా ఆలస్యంగా వచ్చిన చాలా మంది అభ్యర్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలా ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థుల ఘటనలు నమోదయ్యాయి.