Vinayaka Chavithi: శాంతి భద్రతల పేరుతో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరణ సరికాదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
- గణేశ్ విగ్రహాల అనుమతులపై జేసీ స్పందన
- కొన్ని చోట్ల అనుమతులు నిరాకరిస్తున్నారని ఆవేదన
- అనుమతులు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయాలంటూ వినాయకుడికి వేడుకోలు
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయనున్న గణేశ్ విగ్రహాలకు అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం కష్టంగా మారిందంటూ టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పేరుతో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరణ సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. అధికారుల దయాదాక్షిణ్యాలతో హిందువులు పండుగలు జరుపుకోవాలా? అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి అనుమతుల ప్రక్రియపై ఆదివారం ఆయన తీవ్రంగా స్పందించారు.
వినాయక చవితి సందర్భంగా గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు అధికారులు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో అధికారులు విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ నీ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయి స్వామి అంటూ వినాయకుడిని ఆయన ప్రార్థించారు. మునిసిపల్ చైర్మన్గా ఉన్న తనకే విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు తీసుకోవడం కష్టంగా మారితే... ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.