Jharkhand: రాష్ట్రంలో పొలిటికల్​ హీట్​.. ఎమ్మెల్యేలతో పడవ ప్రయాణంతో సేదతీరిన ఝర్ఖాండ్​ సీఎం సోరెన్

Amid political storm in Jharkhand CM Hemant Soren takes boat ride with MLAs

  • జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఉల్లాసంగా పడవ ప్రయాణం చేసిన సోరెన్
  • గనుల లీజు విషయంలో అధికార దుర్వినియోగం కేసులో సోరెన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ 
  • ఆయన  శాసన సభ్యత్వంపై  నిర్ణయం తీసుకోవచ్చని గవర్నర్ కు  చెప్పిన ఈసీ

ఝార్ఖండ్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. గనుల లీజు విషయంలో అధికార దుర్వినియోగం కేసులో  భారత ఎన్నికల కమిషన్.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో హేమంత్ సోరెన్ రాష్ట్రంలోని ఖుంటి జిల్లాలోని లత్రాటు డ్యాం దగ్గర తీరికగా పడవలో విహారం చేస్తూ కనిపించారు. సోరెన్‌తో పాటు ఆయన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కూటమి భాగస్వామి కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. నారింజ రంగు లైఫ్ జాకెట్లు ధరించిన సోరెన్, ఇతర ఎమ్మెల్యేలు చిరునవ్వుతో ఫోటోకు పోజులిచ్చారు. 

తనపై అనర్హత వేటు పడితే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం సోరెన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నుంచి ముప్పు తప్పించుకునేందుకు, తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యూపీఏ శాసనసభ్యుల సమావేశం అనంతరం శనివారం మధ్యాహ్నం రాంచీలోని సీఎం నివాసం నుంచి జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి ఎమ్మెల్యేలను ఎక్కించుకుని బస్సులు బయలుదేరడం కనిపించింది. దీంతో తమ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవ్వకుండా నిరోధించేందుకు వారిని గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్న రిసార్ట్‌కు తరలిస్తారన్న వార్తలు వస్తున్నాయి. వీరిని ఛత్తీస్ గఢ్ లేదా పశ్చిమబెంగాల్ కు తరలించే అవకాశం ఉందని చెపుతున్నారు. 

ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోరెన్ సంకీర్ణ ప్రభుత్వానికి 49 మంది సంఖ్యాబలం ఉంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో సోరెన్ కు చెందిన జేఎంఎం పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒకవేళ సోరెన్ పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ బీజేపీ నుంచి వస్తోంది.  

సీఎంగా ఉంటూనే గనుల లీజును హేమంత్ సోరెన్ తనకు తాను కేటాయించుకున్నారు. ఈ అంశం వివాదాస్పదమయింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ - 9ఏకు ఇది విరుద్ధమంటూ రాజ్ భవన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. దీంతో ఆయన శాసనసభ్యత్వంపై నిర్ణయం తీసుకోవచ్చని గవర్నర్ కు ఈసీ తెలిపింది. ఇప్పుడు బంతి జార్ఖండ్ గవర్నర్ కోర్టులో ఉంది. సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయడంపై జార్ఖండ్ గవర్నర్  సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News