Vinayaka Chavithi: రాష్ట్రంలో వినాయకచవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుం వసూలు చేయడంలేదు: ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్
- ఈ నెల 31న వినాయకచవితి
- గణేశ్ మండపాలకు రుసుం వసూలు చేస్తున్నారంటూ ప్రచారం
- ఖండించిన హరి జవహర్ లాల్
- తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు రుసుం వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ వెల్లడించారు. ఈ ప్రచారంలో నిజంలేదని అన్నారు. వినాయకచవితి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి రుసుం వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు.
గణేశ్ మండపాలు ఏర్పాటు చేయదలిచినవారు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులను సంప్రందించాలని అన్నారు. చట్టపరంగా అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. అంతకుమించి ఎలాంటి రుసుం గానీ, చందాలు గానీ తీసుకున్నా, అందుకు ప్రేరేపించినా... వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరి జవహర్ లాల్ వెల్లడించారు. ఎక్కడైనా వినాయక మండపాలకు రుసుం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందితే, సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు.
రుసుం వసూలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. ఇటువంటి అసత్య, నిరాధార ప్రచారాలను ప్రజలు, భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వినాయకచవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.