Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేయడం వల్ల మాకు రూ.500 కోట్ల నష్టం: సూపర్ టెక్ సంస్థ
- నోయిడాలో అపెక్స్, సియాన్ టవర్ల నిర్మాణం
- నిబంధనలు పాటించలేదన్న సుప్రీంకోర్టు
- కూల్చివేయాలంటూ ఆదేశాలు
- ఇంప్లోజన్ పద్ధతిలో కూల్చివేసిన అధికారులు
నోయిడాలోని రెండు జంట ఆకాశ హర్మ్యాలను అధికారులు నేడు కూల్చివేయడం తెలిసిందే. ఇంప్లోజన్ టెక్నాలజీ ఉపయోగించి, 3,700 కిలోల పేలుడు పదార్థం సాయంతో ఈ ట్విన్ టవర్స్ ను నేలమట్టం చేశారు. కాగా, ఈ టవర్స్ ను నిర్మించిన సూపర్ టెక్ లిమిటెడ్ సంస్థ ఈ కూల్చివేతపై స్పందించింది.
భూమి కొనుగోలు, నిర్మాణ ఖర్చులు, వడ్డీలు అన్నీ కలుపుకుని తమకు రూ.500 కోట్లు నష్టమని సూపర్ టెక్ చైర్మన్ ఆర్కే ఆరోరా వెల్లడించారు. బ్యాంకులకు ఏళ్ల తరబడి 12 శాతం వడ్డీ చెల్లించామని చెప్పారు. నోయిడా డెవలప్ మెంట్ అథారిటీ ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ ప్రకారమే ట్విన్ టవర్స్ నిర్మించామని వెల్లడించారు.
ఈ భవనాల కూల్చివేతకు తాము ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థకు రూ.17.5 కోట్లు చెల్లించామని ఆర్కే అరోరా తెలిపారు. కూల్చివేత సందర్భంగా ఇంకా ఇతర ఖర్చులు కూడా ఉన్నాయని వివరించారు.
కాగా, ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతను దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమోలిషన్స్ అనే మరో సంస్థకు అప్పగించింది. నిబంధనలు పాటించకుండా నిర్మించిన ఈ అపెక్స్, సియాన్ అనే జంట భవనాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే.