Pakistan: భారత్‌తో మ్యాచ్.. క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి అభిమానుల మనసులు గెలుచుకున్న పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్
- అవేశ్ ఖాన్ బౌలింగులో బ్యాట్ ఎడ్జ్‌కు తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లిన బంతి
- అప్పీలు చేయని బౌలర్, కీపర్
- బంతి బ్యాట్‌ను తాకడంతో మౌనంగా మైదానాన్ని వీడిన ఫకర్ జమాన్
- అత్యున్నత క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్న ఐసీసీ
ఆసియాకప్‌లో భాగంగా గతరాత్రి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఫకర్ జమాన్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. తాను అవుటైన విషయం గ్రహించిన ఫకర్ జమాన్.. బౌలర్ అప్పీలు చేయకుండానే మైదానాన్ని వీడాడు. అవేశ్ ఖాన్ సంధించిన షార్ట్ డెలివరీ ఆడే క్రమంలో బంతి అతడి బ్యాట్ కొసకు తగిలి వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చేతిలో పడింది. అయితే కార్తీక్ కానీ, అవేశ్ ఖాన్ కానీ ఆ విషయాన్ని గ్రహించలేదు. దీంతో అప్పీలు చేయలేదు.
వారు అప్పీలు చేయకున్నా బంతి బ్యాట్‌కు తాకడంతో ఫకర్ జమాన్ మౌనంగా మైదానాన్ని వీడాడు. అది చూసి అంపైర్ వేలెత్తాడు. దీంతో 42 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ఆరు బంతులు ఆడిన ఫకర్ పది పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పాక్ బ్యాటర్ ప్రవర్తించిన క్రీడా స్ఫూర్తికి మైదానంలోని ప్రేక్షకులతోపాటు టీవీల్లో చూస్తున్న వారు కూడా ఫిదా అయిపోయారు. అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐసీసీ కూడా అద్భుతమైన క్రీడా స్ఫూర్తి అని కొనియాడింది.
చాలామంది బ్యాటర్లు తాము అవుటైన విషయం తెలిసి కూడా మైదానాన్ని వీడకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారని, కానీ ఫకర్ మాత్రం అద్భుత క్రీడా స్ఫూర్తి కనబరిచి తమ మనసులు గెలుచుకున్నాడంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత బౌలర్ అప్పీలు చేయకున్నా సరే పెవిలియన్‌కు వెళ్లడం ద్వారా అత్యున్నత క్రీడాస్ఫూర్తి కనబరిచాడని మరికొందరు కామెంట్ చేశారు. భారత్-పాక్ మ్యాచ్‌లో ఇలాంటి క్రీడాస్ఫూర్తిని ఆశించలేమని పేర్కొన్నారు.