Vijay Deverakonda: తనను అహంకారి అని విమర్శించిన థియేటర్ యజమానితో విజయ్ దేవరకొండ భేటీ
- బాయ్ కాట్ ట్రెండ్ పై తన వ్యాఖ్యల ఉద్దేశ్యాన్ని వివరించిన విజయ్
- ప్రేక్షకులంటే తనకు గౌరవమని వెల్లడి
- మన్నించాలని కోరిన థియేటర్ యజమాని
విజయ్ దేవరకొండ తన పట్ల దురభిప్రాయాన్ని తొలగించుకునే పనిలో పడ్డాడు. బాలీవుడ్ లో నచ్చని సినిమాలను బహిష్కరించాలంటూ నడుస్తున్న ‘బాయ్ కాట్ ట్రెండ్’ పై విజయ్ ఇటీవలే ఓ కార్యక్రమంలో భాగంగా పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ముంబైలోని మరాఠా మందిర్ అండ్ గైటీ గెలాక్సీ థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్.. విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ ను అహంకారిగా అభివర్ణించారు. అంతేకాదు, బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ ను చూసి నేర్చుకోవాలంటూ హితవు చెప్పారు.
దీంతో విజయ్ దేవరకొండ ముంబై చేరుకుని మనోజ్ దేశాయ్ ను కలుసుకున్నాడు. తన వ్యాఖ్యల్లోని ఉద్దేశ్యాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. తాను ప్రేక్షకులను గౌరవిస్తానని, తన వ్యాఖ్యలను సందర్భోచితంగా తీసుకోవాలని కోరాడు. మనోజ్ దేశాయ్ పాదాలకు నమస్కరించాడు. దీంతో విజయ్ పట్ల అపార్థాన్ని మనోజ్ దేశాయ్ తొలగించుకున్నారు. క్షమాపణ చెప్పారు.
‘‘అతడు నిజంగా మంచి వ్యక్తి. ఒదిగి ఉండే వ్యక్తి. నేను అతడ్ని ఇష్టపడుతూనే ఉంటా. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. నేను ఈ సందర్భంగా ఇస్తున్న హామీ ఏమిటంటే అతడి సినిమాలు అన్నింటినీ నేను ప్రదర్శనకు తీసుకుంటాను. అతడికి అంతా మంచే జరగాలి’’ అంటూ మనోజ్ దేశాయ్ ఓ వీడియో విడుదల చేశారు.