delhi: కాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీలో ‘ఆప్’ బల నిరూపణ

 Delhi CM to counter Operation Lotus with trust vote today

  • విశ్వాస పరీక్షకు సిద్ధమైన సీఎం కేజ్రీవాల్
  • పార్టీ మారాలని తమ ఎమ్మెల్యేలపై బీజేపీ ఒత్తిడి తెస్తోందని ఆరోపణ 
  • మద్యం కుంభకోణాన్ని పక్కదోవ పట్టించేందుకేనన్న బీజేపీ 

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోబోతున్నారు. తమ పార్టీ శాసన సభ్యులను వేటాడేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత సీఎం కేజ్రీవాల్ శాసన సభలో విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు మోషన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ఆప్ ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటలేదని, తమతోనే ఉన్నారని నిరూపించడానికి బలపరీక్షను నిర్వహించనుంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 

   గతవారం కేజ్రీవాల్‌ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ ‘సీరియల్‌ కిల్లర్‌’ లాంటిదని అన్నారు. పార్టీ ఫిరాయించేందుకు పలువురు ఆప్ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఆఫర్ చేయడం ద్వారా ఢిల్లీలోని తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ పన్నాగం పన్నిందని ఆరోపించారు. పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు నేతలపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టిందని ఆరోపించారు. ‘బీజేపీ చేపట్టిన 'ఆపరేషన్‌ కమలం ఢిల్లీ'.. ఆపరేషన్‌ కిచడ్‌గా మారిందని ఢిల్లీ ప్రజల ముందు రుజువు చేసేందుకు వీలుగా అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తీసుకురావాలనుకుంటున్నాను’ అని కేజ్రీవాల్‌ చెప్పారు.

ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. మనీశ్ విద్యాశాఖతో పాటు ఎక్సైజ్ పోర్ట్‌ఫోలియోను కూడా కలిగి ఉన్నారు. పార్టీ మారేందుకు బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని మనీశ్ చెప్పారు. కుట్ర పూరితంగానే మనీశ్ పై ఈ కేసు పెట్టారని కేజ్రీవాల్ ఆరోపించారు. 

మరోవైపు మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేజ్రీవాల్ పార్టీ ఫిరాయింపుల డ్రామాను తెరపైకి తెచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి ఆప్ ఎమ్మెల్యేలను వేటాడే ప్రయత్నం చేస్తున్నారంటూ కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండి పడింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విశ్వాస పరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News