Sunil Gavaskar: ఇదేం షాట్ సెలెక్షన్.. రోహిత్, కోహ్లీపై గవాస్కర్ అసంతృప్తి
- పాకిస్థాన్ తో మ్యాచ్ లో అనవసర షాట్లతో వికెట్లు పారేసుకున్నారన్న గవాస్కర్
- భారీ సిక్సర్లు అవసరం లేని సమయంలో షాట్లు కొట్టారని వ్యాఖ్య
- ఈ మ్యాచ్ తో పాఠాలు నేర్చుకోవాలని సూచించిన దిగ్గజ క్రికెటర్
ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై అద్భుత విజయంతో భారత్ శుభారంభం చేసింది. అయితే, ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్ల ఆటతీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పెదవి విరిచారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ షాట్ సెలెక్షన్ ను ప్రశ్నించారు. తమ షాట్ ఎంపిక గురించి జాగ్రత్తగా ఉండాలని ఈ ఇద్దరికీ సూచించాడు. పాక్ ఇచ్చిన 148 పరుగులను ఛేజింగ్ లో భారత్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది, కానీ రెండో వికెట్‌కు రోహిత్, విరాట్ల 49 పరుగుల భాగస్వామ్యంతో తిరిగి గాడిలో పడింది.
కానీ, గ్రౌండ్లో భారీ షాట్లకు ప్రయత్నించిన రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఎడమ చేతి వాటం బౌలర్ మహ్మద్ నవాజ్ బౌలింగ్ లో ఔటయ్యారు. దాంతో, 7.5 ఓవర్లలో 50/1తో నిలిచిన భారత్ ఎనిమిది బంతుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి 53/3తో కష్టాల్లో పడింది. కోహ్లీ అదృష్టం కొద్దీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగాడని గవాస్కర్ అన్నాడు. ఎందుకంటే, తొలి ఓవర్లోనే నసీమ్ షా బౌలింగ్ లో స్లిప్‌లో ఫీల్డర్ క్యాచ్ వదిలేయడంతో కోహ్లీకి ఆరంభంలోనే లైఫ్‌లైన్ లభించింది.
‘రాహుల్ కేవలం ఒక బంతి మాత్రమే ఆడాడు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడలేం. రోహిత్, కోహ్లీకి కొంత సేపు బ్యాటింగ్ చేసే అవకాశం లభించగా, పరుగులు రాబట్టారు. ఇంతకుముందు కోహ్లీ ఫామ్ గురించి ప్రజలు మాట్లాడుతున్నప్పుడు, అతనికి అదృష్టం లేదని నేను చెబుతూ వచ్చా. కానీ, ఈరోజు అతనికి అదృష్టం కలిసొచ్చింది. అతనిచ్చిన క్యాచ్ లు డ్రాప్ అయ్యాయి. కొన్ని ఇన్సైడ్ ఎడ్జ్‌లు వచ్చాయి. బాల్స్ కూడా వికెట్లకు దగ్గరగా వెళ్లాయి. అయినా అదృష్టం అతడిని వరించింది. దీన్ని సద్వినియోగం చేసుకుకుంటూ కోహ్లీ చాలా చక్కటి షాట్లు ఆడాడు.
ఇక అతను ఆడుతున్న విధానం చూస్తే కనీసం 60-70 పరుగులైనా చేస్తాడని అందరూ ఊహించారు. అయితే, రోహిత్ అవుటైన వెంటనే అతనూ ఔటయ్యాడు. ఇద్దరూ అనవసర షాట్లతో ఔటయ్యారు. ఆ దశలో వాళ్లు సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నించి ఉండాల్సింది కాదు. ఎందుకంటే సాధించాల్సిన రన్ రేట్ 19, 20 కాదు. కాబట్టి అలాంటి షాట్లు అనవసరం. 70-80 రన్స్ చేసిన తర్వాత భారీ షాట్ల కోసం ట్రై చేస్తే బాగుండేది. ఏదేమైనా ఈ మ్యాచ్ నుంచి రోహిత్, కోహ్లీ పాఠాలు నేర్చుకోవాలి’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.