Artemis-1: ఇంజిన్ లో లీకేజి... ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని వాయిదా వేసిన నాసా
- ప్రయోగానికి ముందు ఇంజిన్ లో లోపం
- లాంచ్ ప్యాడ్ వద్ద పిడుగుపాటు
- ఇంధనం నింపే ప్రక్రియకు అంతరాయం
- ప్రయోగం ఇప్పుడు జరపబోవడంలేదని నాసా ప్రకటన
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చంద్రుడిపైకి చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. మరికొద్దిసేపట్లో ప్రయోగం జరగాల్సి ఉండగా, రాకెట్ ఇంజిన్ లో ఇంధన లీకేజిని గుర్తించారు. దాంతో ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు నాసా ప్రకటించింది. ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించేది నాసా వెల్లడించలేదు.
రాకెట్ లో 10 లక్షల గ్యాలన్ల హైడ్రోజన్, ఆక్సిజన్ నింపాల్సి ఉందని నాసా పేర్కొంది. ఈ ప్రక్రియకు ఇంధన లీకేజి అడ్డంకిగా మారిందని వివరించింది. లాంచ్ ప్యాడ్ ఉన్న ప్రాంతంలో పిడుగులు పడడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని భావిస్తున్నట్టు వెల్లడించింది.
చంద్రుడిపైకి మానవుడ్ని పంపే ప్రాజెక్టులో భాగంగానే ఆర్టెమిస్-1 చేపట్టారు. ఇందులో భాగంగా, మొదట మానవ రహిత ఓరియన్ కాప్స్యూల్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది. అనంతరం 2024లో ఆర్టెమిస్-2, 2025లో ఆర్టెమిస్-3 ప్రయోగాలు చేపట్టాలని నాసా నిర్ణయించింది. ఆర్టెమిస్-3 ద్వారా మనిషిని చంద్రుడిపైకి పంపనున్నారు.