Nara Lokesh: కుప్పంలోని అన్నా క్యాంటీన్ పై అర్ధరాత్రి దాడి.. నారా లోకేశ్ ఆగ్రహం.. ధ్వంసమైన క్యాంటీన్ ఫొటోలు ఇవిగో!
- ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన దుండగులు
- నిన్న అర్ధరాత్రి మరోసారి ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- ఇది వైసీపీ రౌడీల పనే అంటూ నారా లోకేశ్ ఆగ్రహం
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా కొందరు దుండగులు అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. నిన్న అర్ధరాత్రి మరోసారి అన్నా క్యాంటీన్ ను కొందరు ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు క్యాంటీన్ పై దాడి చేసి తాత్కాలిక షెడ్లను కూల్చి వేశారు. ఫ్లెక్సీలను చించేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ దాడి చేసింది వైసీపీ కార్యకర్తలే అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కారణంగా కుప్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు, అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లపై దాడి ముఖ్యమంత్రి జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న క్యాంటీన్ పై వైసీపీ రౌడీలు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు పేద వాడి నోటి దగ్గర కూడును లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్నా క్యాంటీన్లను నిర్వహించి తీరుతామని అన్నారు. అర్ధరాత్రి కుప్పంలో అన్నా క్యాంటీన్ పై దాడి చేసిన వైసీపీ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.