Security Gaurd: ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీ గార్డు చెంపలు వాయించిన వ్యక్తి.. వీడియో ఇదే!

Security guard slapped after helping man get out of faulty lift in Gurugram

  • గురుగ్రామ్‌లో ఘటన.. మధ్యలో ఆగిపోయిన లిఫ్ట్
  • ఐదు నిమిషాల్లో రిపేరు చేయించి కాపాడిన సెక్యూరిటీ గార్డు
  • బయటకు వచ్చీ రాగానే సెక్యూరిటీగార్డుపై చేయి చేసుకున్న రెసిడెంట్
  • విధులు బహిష్కరించిన గార్డులు

అపాయంలో చిక్కుకున్నప్పుడు రక్షించిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పడం చాలా సర్వసాధారణమైన విషయం. కానీ గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడగానే తనను రక్షించిన సెక్యూరిటీగార్డుపై చిందులేశాడు. అతని చెంపలు చెడామడా వాయించాడు. ఇదంతా అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు అతడిపై కేసులు నమోదు చేశారు.

 పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌లోని క్లోజ్ నార్త్ సొసైటీకి చెందిన వరుణ్ నాథ్ తానుంటున్న అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి కిందికి వస్తున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో లిఫ్ట్‌లో అమర్చిన ఇంటర్‌కమ్ ద్వారా సెక్యూరిటీగార్డు అశోక్‌కు సమాచారం అందించాడు. దీంతో లిఫ్ట్‌మ్యాన్‌ను అక్కడికి తీసుకెళ్లిన అశోక్ సమస్యను సరిదిద్దాడు. ఇందుకు ఐదు నిమిషాలు పట్టింది. 

మొత్తానికి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన వరుణ్ నాథ్ ఆ వెంటనే ఆగ్రహంతో ఊగిపోతూ సెక్యూరిటీ గార్డుపై చిందులేశాడు. అతడి చెంపలు చెడామడా వాయించాడు. అంతేకాదు, ఆ తర్వాత లిఫ్ట్‌మ్యాన్‌పైనా దాడిచేసి చెంపలు వాయించాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. 

ఇలా రెసిడెంట్ చేయి చేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీలోని సెక్యూరిటీ గార్డులు ఆందోళనకు దిగారు. వరుణ్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. విధులను బహిష్కరించారు. సొసైటీ రెసిడెంట్స్‌కు సేవలు అందించేందుకు తాము రాత్రి పగలు కష్టపడుతుంటే ఇలా దాడులకు దిగుతారా? అని మండిపడ్డారు. వారు తమను బానిసల్లా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వరుణ్‌పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన వరుణ్‌ను రక్షించి, బయటకు తీసుకొస్తే తనపైనే దాడిచేశారని అశోక్ కుమార్ వాపోయాడు. సెక్యూరిటీగార్డుల ఫిర్యాదుతో వరుణ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News