Congress: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఎంపీ శశిథరూర్!

Shashi Tharoor Planning To Run For Congress President

  • ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటున్న పార్టీ వర్గాలు
  • ఇంకా నిర్ణయం ప్రకటించని థరూర్
  • సీడబ్ల్యూసీలోని ఇతర స్థానాలకు ఎన్నిక జరగాలన్న శశి
  • అధ్యక్ష పదవిని నిరాకరిస్తున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై థరూర్ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ లో సంస్థాగత సంస్కరణలు కోరుతూ 2020లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన జీ23 మంది నేతల బృందంలో తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కూడా ఉన్నారు. 

తాజాగా మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’కి ఓ వ్యాసం రాసిన శశి థరూర్ ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా’ ఎన్నిక నిర్వహించాలన్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లోని డజను స్థానాలకు కూడా ఎన్నికలను ప్రకటించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజా అధ్యక్షుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్‌కు చాలా అవసరమని అభిప్రాయపడ్డ థరూర్.. ఇది పార్టీ పునరుజ్జీవనానికి నాంది అవుతుందని తన వ్యాసంలో పేర్కొన్నారు. ఎన్నికల వల్ల ఇతర ప్రయోజనకరమైన ప్రభావాలు కూడా ఉన్నాయన్నారు. పార్టీ మొత్తానికి పునరుద్ధరణ అవసరం అయితే, అత్యవసరంగా భర్తీ చేయాల్సిన నాయకత్వ స్థానం సహజంగానే కాంగ్రెస్ అధ్యక్షుడిదేనని థరూర్ అన్నారు.

అంతర్గత కల్లోలాలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఆదివారం తమ అధ్యక్షుడి ఎన్నికను అక్టోబర్ 17న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 19న ఫలితాలు వెల్లడికానున్నాయి. సెప్టెంబరు 22న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండగా, నామినేషన్ల దాఖలు సెప్టెంబరు 24న ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుంది. 

పార్టీ షెడ్యూల్‌ను ప్రకటించిన సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు. అంతకుముందు సీడబ్ల్యుపీ సమావేశంలో పాల్గొన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ సహా పలువురు నాయకులు మాత్రం రాహుల్ గాంధీ పార్టీ చీఫ్‌గా తిరిగి రావాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. కానీ, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండకూడదనే పట్టుదలతో ఉన్నారని పలువురు పార్టీ సన్నిహితులు చెబుతున్నారు. 

కాగా, కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవికి రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 1997లో శరద్ పవార్, రాజేశ్‌ పైలట్, సీతారాం కేసరి పోటీ పడ్డారు. సీతారాం కేసరి విజయం సాధించారు.  2000లో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీకి 7,448 ఓట్లు రాగా.. జితేంద్ర ప్రసాద్‌కు 94 వచ్చాయి. ఈసారి శశి థరూర్‌, మనీశ్‌ తివారి, పృథ్వీరాజ్‌ చౌవాన్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News