Jagan: ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. మూడు రోజుల కడప పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్
- సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు కడప జిల్లా పర్యటన
- 2న వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్న జగన్
- అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరపనున్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 1న ఆయన కడపకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి కేబినెట్ భేటీ నిన్ననే జరగాల్సి ఉంది. అయితే ఈ భేటీని కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు. ఇప్పుడు సీఎం కడప జిల్లా పర్యటన నేపథ్యంలో ఆ సమావేశం మరోసారి వాయిదా పడింది.
సెప్టెంబర్ 1న జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయం కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 5.35 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
2వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైయస్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఉన్న ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం వరకు ఈ సమీక్షా సమావేశం కొనసాగుతుంది. రాత్రికి ఇడుపులపాయలోనే బస చేస్తారు. 3వ తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయల్దేరి 10.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.