Kapil Dev: పాకిస్థాన్ పై టీమిండియా గెలవడంపై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- గెలిచింది ఇండియానా? లేక పాకిస్థానా? అనేది ముఖ్యం కాదన్న కపిల్
- క్రికెట్టే గెలిచిందని తాను చెపుతానన్న క్రికెట్ దిగ్గజం
- రెండు జట్లు అద్భుతంగా ఆడాయని కితాబు
యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ లో పాకిస్థాన్ ను భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో దాయాది పాక్ ను టీమిండియా చిత్తు చేయడంలో భారత్ లో సంబరాలు అంబరాన్నంటాయి. మరోవైపు, భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిచింది ఇండియానా? లేక పాకిస్థానా? అనేది ముఖ్యం కాదని... క్రికెటే గెలిచిందని తాను చెపుతానని ఆయన అన్నారు.
ఇండియా-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ అద్భుతంగా కొనసాగిందని చెప్పారు. రెండు జట్లు చాలా బాగా ఆడాయని కితాబునిచ్చారు. అయితే, మ్యాచ్ లో గెలిచిన టీమ్ కు చాలా సంతోషంగా ఉంటుందని... ఇదే సమయంలో ఓటమిపాలైన టీమ్ వచ్చే మ్యాచ్ లో సత్తా చాటుతామని చెపుతుందని అన్నారు. ఆట అంటే ఇదేనని చెప్పారు.
మరోవైపు, దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. మూడు వికెట్లు తీయడమే కాక... 33 పరుగులతో మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చిన హార్ధిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.