Wasim Akram: భారత్ తో మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ నిర్ణయాలను తప్పుబట్టిన వసీం అక్రమ్
- ఆసియా కప్ లో పాక్ జట్టుకు భంగపాటు
- భారత్ చేతిలో పరాజయం
- బాబర్ అజామ్ కెప్టెన్సీనే కారణమన్న అక్రమ్
- చివరి ఓవర్ ను స్పిన్నర్ కు ఇవ్వడంపై విమర్శలు
గతేడాది టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను ఓడించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్ జట్టు... ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో భారత్ చేతిలో భంగపాటు ఎదుర్కొంది. పాక్ ఓటమి ఆ దేశ మాజీలకు మింగుడుపడడంలేదు. పాక్ జట్టు ఓటమికి కెప్టెన్ బాబర్ అజామే కారణమని మాజీ సారథి వసీం అక్రమ్ విమర్శించాడు. బ్యాటింగ్ లో విఫలమైన అజామ్... ఆపై భారత్ బ్యాటింగ్ వేళ కెప్టెన్సీ పరంగానూ ఆకట్టుకోలేకపోయాడని వెల్లడించాడు.
రోహిత్, కోహ్లీ వంటి భారత స్టార్లను అవుట్ చేసిన స్పిన్నర్ మహ్మద్ నవాజ్ ను సరైన సమయాల్లో బౌలింగ్ కు దించడంలో కెప్టెన్ గా అజామ్ విఫలమయ్యాడని తెలిపాడు. మిడిల్ ఓవర్లలో కాకుండా, నవాజ్ ను ఆఖర్లో బౌలింగ్ కు దింపడం పెద్ద తప్పిదమని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యా, జడేజా వంటి హిట్టర్లు క్రీజులో ఉన్నప్పుడు చివరి ఓవర్లను ఓ స్పిన్నర్ తో వేయించడం సరికాదని అన్నాడు. ఈ మ్యాచ్ లో బాబర్ నిర్ణయాలు బెడిసికొట్టాయని పేర్కొన్నాడు.