Kona Raghupathi: కనీసం ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేని చంద్రబాబు, బీజేపీ నేతలు వినాయకచవితి గురించి మాట్లాడుతున్నారు: ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
- ఏపీలో వినాయకచవితిపై ఆంక్షలు లేవన్న రఘుపతి
- విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం
- చంద్రబాబు దిగజారిపోయారని విమర్శలు
- జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ కితాబు
టీడీపీ, బీజేపీ నేతలపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ధ్వజమెత్తారు. వినాయకచవితిపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటూ గత వారం రోజులుగా విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. వినాయక చవితిపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉత్సవ కమిటీలు, స్థానిక పోలీసుల మధ్య చక్కని సమన్వయం ఉందని వెల్లడించారు. అయితే దిగజారిపోయిన చంద్రబాబు ఆలోచనలు ఏ స్థాయికైనా వెళ్లొచ్చని, జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖకు సూచించారు.
ఏపీలో సీఎం జగన్ చలవతోనే పదేళ్ల తర్వాత ధార్మిక పరిషత్ ఏర్పాటైందని కోన రఘుపతి వెల్లడించారు. కనీసం ధార్మిక పరిషత్ కూడా ఏర్పాటు చేయలేని చంద్రబాబు, బీజేపీ నేతలు ఇవాళ వినాయకచవితి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి కూడా విమర్శిస్తున్నాడంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో ఆలయాలు కూలగొట్టిన చరిత్ర వాళ్ల సొంతమని, తమ నాయకుడు ఆలయాలు నిర్మిస్తున్నారని వెల్లడించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం సీఎం జగన్ పాటుపడుతున్నారని వివరించారు.
ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ పైనా కోన రఘుపతి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవడం మానేస్తేనే పవన్ కల్యాణ్ కు భవిష్యత్తు ఉంటుందని, అప్పటివరకు ప్రజలు నమ్మరు... గౌరవించరు అని స్పష్టం చేశారు.