Crocodile: ఒక మొసలి.. మరో మొసలిని పట్టుకుని తినేస్తే..! వీడియో ఇదిగో..
- అమెరికాలోని ఫ్లోరిడా సిల్వర్ స్ప్రింగ్స్ స్టేట్ పార్క్ లో ఘటన
- అక్కడి సరస్సులో ఓ వ్యక్తి బోటులో వెళుతుండగా కనిపించిన దృశ్యం
- మొసళ్లు ఇలా ఒకదానినొకటి తినడం అరుదని చెబుతున్న నిపుణులు
సాధారణంగా ఏ జీవి అయినా.. తన జాతికే చెందిన జీవులను తినడం అరుదు. ఒకవేళ ఆధిపత్యం కోసం ఒకదానిపై ఒకటి పోరాడి చంపేసుకున్నా.. ఆహారం కోసం మాత్రం సొంత జాతి జీవులను తినడం అతి తక్కువ. ఇలా తమ సొంత జాతి జీవులను తినడాన్ని కేనిబాలిజం అంటారు. పాముల వంటి కొన్నిరకాల జీవుల్లో మాత్రమే ఇలాంటి కేనిబాలిజం కనిపిస్తుంటుంది. ఇదే తరహాలో ఓ మొసలి మరో మొసలిని పట్టి తినేసిన వీడియో తాజాగా వైరల్ గా మారింది.
ఓ వ్యక్తి బోట్ లో వెళుతుండగా..
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సిల్వర్ స్ప్రింగ్స్ స్టేట్ పార్క్ లో టామీ షా అనే వ్యక్తి ఓ వీడియో తీశాడు. నేషనల్ పార్క్ లో ఉన్న సరస్సులో ఓ పెడల్ బోట్ లో వెళుతుండగా.. ఓ పెద్ద మొసలి కదులుతుండటం కనిపించింది. దాన్ని వీడియో తీయడం మొదలుపెట్టిన టామీ షా.. అక్కడేం జరుగుతున్నది చూదగా, ఒళ్లు జలదరించింది. ఓ పెద్ద మొసలి మరో మొసలిని పట్టుకుని రావడం చూశాడు. తన బోట్ కు సమీపంలోనే.. ఆ మొసలిని గట్టిగా కరిచి పట్టుకుని.. నీటిలోంచి పైకి ఎగరేసినట్టుగా చేస్తూ మళ్లీ కిందికి బాదడం మొదలుపెట్టింది.
- సాధారణంగా మొసళ్లు నదిలోగానీ, సముద్రంలోగానీ తాము పట్టుకున్న జీవిని ఇలాగే పైకి కిందకు బాదడం, గుండ్రంగా తిప్పుతూ నీటిలో మునిగేలా, ఊపిరాడకుండా చేయడం వంటివి చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
- సాధారణంగా మొసళ్లు కలిసి ఉంటాయని.. గుంపులుగా వేటాడుతుంటాయని నిపుణులు వివరిస్తున్నారు. కానీ ఇలా మరో మొసలిని పట్టుకుని తినడం అరుదని అంటున్నారు.
- టామీ షా ఈ వీడియోను ఫేస్ బుక్ లో పెట్టగా విపరీతంగా వైరల్ గా మారింది. తర్వాత యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా సైట్లలోనూ చక్కర్లు కొడుతోంది. యూట్యూబ్ లో ఇప్పటివరకు 2 లక్షల మందికిపైగా వీక్షించారు.