Nara Lokesh: చిత్తూరు జైలులో టీడీపీ నేతలను పరామర్శించిన నారా లోకేశ్

Nara Lokesh talks to TDP leaders at Chittoor prison

  • ఇటీవల అరెస్టయిన టీడీపీ నేతలు
  • నేడు చిత్తూరు జిల్లాలో లోకేశ్ పర్యటన
  • వైసీపీ నేతలపై ఆగ్రహం
  • కుప్పంలో ఎప్పటికీ చంద్రబాబే ఎమ్మెల్యే అని వెల్లడి

చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల అరెస్టయి జైలులో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలకు ధైర్యం చెప్పారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. పోలీసులు వైసీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసులను విడిచిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. 

అటు, ఇవాళ కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం చేసిన ఘటనపై నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేసినవాళ్లు మనుషులా? పశువులా? అంటూ మండిపడ్డారు. నిరుపేద కుటుంబాలు కూడా కడుపునిండా భోంచేయాలన్న ఉద్దేశంతో నాటి సీఎం చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్లు ప్రారంభించారని లోకేశ్ అన్నారు. కానీ, సొంత తల్లికి, సొంత చెల్లికి ముద్ద పెట్టలేనివాడు ప్రజలకు ఎట్లా ముద్ద పెడతాడు? అంటూ విరుచుకుపడ్డారు. సొంత తల్లిని, సొంత చెల్లిని ఎలా మెడపట్టి గెంటేశాడో, ఇవాళ నిరుపేదలకు భోజనం లేకుండా చేశాడని విమర్శించారు. 

 "అసలు, జగన్ మోహన్ రెడ్డి కుప్పంకు ఏం చేశాడని అడుగుతున్నా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డీ... నువ్వు చెప్పయ్యా! భరత్ ను అడుగుతున్నా... నువ్వు చెప్పు... కుప్పంకు ఏంచేశాడు ఆ జగన్ రెడ్డి? ఇడుపులపాయ పంచాయతీ తీసుకువచ్చాడు... రౌడీయిజం తీసుకువచ్చాడు. చంద్రబాబునాయుడు ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు సీఎంగా ఉన్నారు... ఆయన హయాంలో ఏనాడైనా కుప్పంలో ఇలాంటి ఘటనలు జరిగాయా? ఆరోజున చంద్రబాబు తలుచుకుని ఉంటే మీరందరూ ఇలా వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండేదా? 

చంద్రబాబు సీఎం అయ్యాక కుప్పంకు రోడ్లు వేశారు... ఆసుపత్రులు కట్టారు. ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి, మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఫ్లై ఓవర్లు కట్టారు. తాగునీటి పథకాలు తీసుకువచ్చాడు, పేదలకు ఇళ్లు నిర్మించాడు. కుప్పంలో అనేక పరిశ్రమలు తీసుకువచ్చాడు. ఇవాళ కుప్పంలో 25 వేల మంది పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా అన్ని పరిశ్రమలు లేవు" అంటూ లోకేశ్ వివరించారు. 

కుప్పంలో ఎప్పటికీ చంద్రబాబునాయుడే ఎమ్మెల్యేగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇక, తమ పొత్తు ప్రజలతోనే అని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై, ప్రజల కోసం పోరాడుతున్నామని, ప్రజలతోనే కలిసి నడుస్తామని ఉద్ఘాటించారు. గడపగడపకు వెళుతున్న వైసీపీ నేతలను ప్రజలు తరిమికొడుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News