CM KCR: వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, పవన్ కల్యాణ్
- ఆగస్టు 31న వినాయకచవితి
- దేశవ్యాప్తంగా కోలాహలం
- ఏకదంతుని దీవెనలు అందరికీ లభించాలన్న కేసీఆర్
- మట్టివినాయకులను పూజిద్దామంటూ పవన్ పిలుపు
రేపు (ఆగస్టు 31) వినాయకచవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖశాంతులతో కూడిన జీవితం సాకారమయ్యేలా ఆ ఏకదంతుని దీవెనలు దేశ ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సకల శాస్త్రాలకు అధిపతి వినాయకుడు అని, బుద్ధి, జ్ఞానానికి ఆరాధ్యుడుగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా హిందువులు భక్తిశ్రద్ధలతో గణేశుడిని ఆరాధిస్తారని అన్నారు.
వినాయకచవితి మనకు జ్ఞానం, నైతిక విలువలు, లక్ష్యసాధన, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను మనకు నేర్పుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. వినాయక నవరాత్రులను ప్రజలు భక్తిశ్రద్ధలతో, శాంతిసౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా, సంతోషకరమైన రీతిలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అటు, జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ. వినాయకచవితి అందరూ కలసిమెలసి జరుపుకునే పండుగ అని, తొమ్మిది రోజుల అంగరంగ వేడుక అని వివరించారు. ఆధ్యాత్మికతతో కూడిన ఆనందమయ వినాయకచవితి ఒకనాడు తెల్లవారిపై పోరాటానికి, హిందువుల సమైక్యతకు ఆలంబనగా నిలిచిందని వివరించారు.
హిందూయేతర మత విశ్వాసాలను పాటించేవారు కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వినాయక ఉత్సవాల్లో పాల్గొంటారని పవన్ వెల్లడించారు. మన హైదరాబాద్ వంటి నగరాల్లో నిమజ్జనం సందర్భంగా ముస్లిం సోదరులు తాగునీరు, అల్పాహారాలు అందిచడం వంటివి మన దేశ మత సామరస్యానికి నిదర్శనంలా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇంతటి మహత్తరమైన తొలి పండుగ వినాయక చతుర్థి సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలుగువారికి తన పక్షాన, జనసేన పక్షాన భక్తిపూర్వక శుభకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో వివరించారు.
ఈ పండుగలో మట్టి వినాయకులనే పూజించాలని మనవి చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల సంప్రదాయాన్ని పాటించినట్టవుతుందని, అదే సమయంలో పర్యావరణానికి మేలు చేసినట్టూ అవుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలందరికీ శుభాలు కలుగజేయాలని, పాలన మాటున ప్రజలను పీడించే నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని ఆ విఘ్నాధిపతిని మనసారా ప్రార్థిస్తున్నానని తెలిపారు.