Telangana: తెలంగాణలో 663 గ్రూప్​–2, 1,373 గ్రూప్​–3 ఉద్యోగాలకు లైన్​ క్లియర్​.. త్వరలో భర్తీకి నోటిఫికేషన్​!

Telangana government to fill 2910 jobs

  • మొత్తం 2,910 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి
  • ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో 50 వేల మైలురాయిని అధిగమించినట్టు ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడి
  • వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్న మంత్రి

తెలంగాణలో కొత్తగా 2,910 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా అనుమతి మంజూరు చేసింది. ఇందులో 663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1,373 గ్రూప్‌-3 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. వీటితో కలిపి ఇటీవలి కాలంలో ఉద్యోగాల భర్తీలో యాభై వేల మైలు రాయిని దాటినట్టేనని వెల్లడించారు. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వేగంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని.. గత మూడు నెలల్లోనే 52,460 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చామని వివరించారు. మరిన్ని ఉద్యోగాల భర్తీకి త్వరలోనే అనుమతి ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఇవీ..
  • తాజాగా భర్తీ చేయనున్న గ్రూప్–2 ఉద్యోగాల్లో.. జీఏడీ ఏఎస్‌వో  పోస్టులు 165, పంచాయతీ రాజ్ ఎంపీవో పోస్టులు 125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 98, ఎక్సైజ్ ఎస్సై పోస్టులు 97, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 59 పోస్టులు ఉన్నాయి.
  • గ్రూప్–2 ఉద్యోగాల్లోనే 38 చేనేత ఏడీవో, 25 ఆర్థికశాఖ ఏఎస్‌వో, 15 అసెంబ్లీ ఏఎస్‌వో , 14 గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్, 11 గ్రేడ్-3 మునిసిపల్ కమిషనర్, తొమ్మిది ఏఎల్‌వో, ఆరు న్యాయశాఖ ఏఎస్‌వో పోస్టులు ఉన్నాయి.
  • ఇక గ్రూప్ -3 ఉద్యోగాల్లో మొత్తం 99 విభాగాధిపతుల పరిధిలోని 1,373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. 

  • Loading...

More Telugu News